● రాత్రివేళ మున్సిపల్ అధికారుల వేధింపులు
● పన్ను వసూళ్లలో పాల్గొన్న కమిషనర్
● అప్పు తెచ్చి పన్ను చెల్లింపు
చెన్నూర్: ‘ఆస్తి పన్ను చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తాం..’ అంటూ మున్సిపల్ అధికారులు రాత్రివేళ హడావుడి చేశారు. కూలీ పనులు చేసుకునే తాము రాత్రి సమయంలో ఎలా చెల్లించేదంటూ వేడుకున్నా కనికరించలేదు. అప్పుటికప్పుడు అప్పు తెచ్చి ఇవ్వడంతో అక్కడి నుంచి కదిలారు. ఈ సంఘటన చెన్నూర్ మున్సిపల్ పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మార్చి నెల కావడంతో ఇంటి పన్ను డిమాండ్ మేరకు వసూలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా చెన్నూర్ మున్సిపల్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పన్నుల వసూలులో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వేధింపులకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. మంగళవారం రాత్రి 7గంటల ప్రాంతంలో బొజ్జ పోచం, అకినపల్లి ఆనంద్ ఇళ్లకు వెళ్లి పన్ను చెల్లించకుంటే ఇళ్లకు తాళం వేస్తామని బెదిరించారు. ఆనంద్ ఇంటి పన్ను రూ.8వేలు బకాయి ఉంది. చెల్లించకుంటే ఇంటికి తాళం వేస్తామని హడావుడి చేశారు. ఇల్లు తమ తల్లి పేరున ఉందని, అన్నదమ్ములు డబ్బు ఇవ్వలేదని, కూలీ పని చేసుకుని జీవించే తాను రేపు చెల్లిస్తానని ఆనంద్ అధికారులను వేడుకున్నాడు. అయినా వారు వినకపోవడంతో అప్పటికప్పుడు రూ.2,200 అప్పు తెచ్చి అధికారులకు చెల్లించాడు. దీంతో అధికారులు వెళ్లిపోయారు. కాగా, ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణను సంప్రదించగా.. పన్ను వసూలు లక్ష్యం చేరాలంటే రాత్రి ఏడు ఎనిమిది గంటల వరకు వసూలు చేస్తామని అన్నారు. మొండి బకాయిలు వంద శాతం వసూలుకు సమయంతో పని లేదంటూ పేర్కొనడం గమనార్హం.