
● ఆరు నెలల్లో 50లక్షల మంది మహిళా ప్రయాణికులు ● కిక్కిరి
మంచిర్యాలఅర్బన్: మహలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో పరిమితికి మించి ప్రయా ణం సాగుతోంది. ఒకప్పుడు ఖాళీ సీట్లతో రాకపోకలు సాగించిన బస్సుల్లో ప్రయాణికులు కిక్కిరిసి పోతున్నారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్ధేశించిన లక్ష్యా ని కంటే రెట్టింపు ఆదాయం వస్తోంది. ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయా ణం కల్పించిన విషయం తెలిసిందే, మహాలక్ష్మి పథ కం అమల్లోకి వచ్చిన తర్వాత ఆరు నెలల్లో 50లక్షల మందికిపైనే ప్రయాణం చేశారు. ప్రయాణికుల సంఖ్య, ఆదాయం పెరగడంతో ఆర్టీసీ కళకళలాడుతోంది.
రెట్టింపు ప్రయాణం..
మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో రెట్టింపు ఆదాయం వస్తోంది. సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సాగిస్తున్నారు. మంచిర్యాల డిపో పరిధిలో 148 బస్సులు ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. సంస్థ బస్సుల్లో రాజధాని 7, సూపర్‌లగ్జరీ బస్సులు 25, ఎక్స్‌ప్రెస్ బస్సులు 7, పల్లెవెలుగులు 35 ఉన్నాయి. అద్దెబస్సుల్లో ఎక్స్‌ప్రెస్ 14, పల్లెవెలుగు 54 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిబంధనల ప్రకారం పల్లె బస్సుల్లో 55సీట్లు, సూపర్ లగ్జరీలో 36, రాజధాని 40, ఎక్స్‌ప్రెస్‌లో 50 సీట్లు ఉంటాయి. ప్రస్తుతం మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో పరిమితికి మించి ప్రయాణం సాగుతోంది. ఒక్కో బస్సులో 120 మందికిపైగా ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి.
మార్చిలోనే అత్యధికం..
రాష్ట్రంలో గతేడాది డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం ప్రారంభించారు. ప్రయాణ సమయంలో ఆధార్‌కార్డు చూపిస్తే జీరో టికెట్ జారీ చేస్తున్నారు. ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో 89,80,565 మంది ప్రయాణం చేశారు. ఇందులో ఉచిత ప్రయాణం చేసిన మహిళలు 50,16,567 మంది ఉన్నారు. చిన్నపిల్లలతో కలుపుకొని 51,69,317 మంది ప్రయాణించారు. రూ.19,91,35,000 ఆదాయం సమకూరింది. మార్చిలో 11,14,382 మంది మహిళలు అత్యధికంగా ప్రయాణించారు. రద్దీ అంతకంతకు పెరుగుతున్నా బస్సులు రాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడుపుతూ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆర్టీసీ డీఎం రవీంద్రనాథ్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు వద్ద ప్రయాణికులు
మంచిర్యాల డిపోలో డిసెంబర్ 15నుంచి మే 8వరకు ప్రయాణికుల సంఖ్య
నెల మొత్తం ప్రయాణికులు మహిళలు చిన్నారులు
డిసెంబర్ 10,66,125 5,86,243 19,156
జనవరి 18,27,829 9,90,947 33,034
ఫిబ్రవరి 18,74,663 10,49,234 34,522
మార్చి 19,48,907 11,14,382 28,180
ఏప్రిల్ 18,02,650 10,21276 29,322
మే 4,60,391 2,54,485 8536
89,80,565 50,16,567 1,52,750