మదనాపురం: ప్రకృతి మాత తన అక్షయపాత్ర నుంచి మానవాళికి ప్రసాదించిన అపురూప వరప్రసాదం మునగ. ఇది కేవలం పెరటి చెట్టు కాదు.. ప్రాణదాత. వినీల ఆకా శం కింద పచ్చని తోరణంలా విరిసే ఈ మొక్క, మానవ దేహానికి అవసరమైన పోష కాలను తన ప్రతి అణువులోనూ నింపుకొన్న ఒక శాకాహార నిధి. మునగలోని మాధుర్యం, దాని వెనుక ఉన్న ఆరోగ్యం గురించి మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా.అనిత వివరించారు.
కనుచూపునకు వెలుగురేఖ..
క్యారెట్ కన్నా పది రెట్లు మిన్నగా విటమిన్ అని నింపుకుని, నయనాలకు కాంతిని ఇస్తుంది. పాల కన్నా పదిహేడు రెట్లు అధికంగా కాల్షియాన్ని అందిస్తూ ఎముకలను దృఢంగా మలుస్తుంది. పాలకూరను మించిన ఐరన్ ధారల తో రక్తహీనతను పారద్రోలుతుంది. నారింజను తలదన్నే విటమిన్–ఈ, అరటిని మించిన పొటాషియంతో దేహానికి నవ చైతన్యాన్ని ఇస్తుంది.తొమ్మిది రకాల ప్రాణధార అమైనో ఆమ్లాలు మునగలో కొలువై ఉన్నాయి. ఇది ఒక పరిపూర్ణ ప్రోటీన్ల కల్పవృక్షమని తెలిపారు.
ఆరోగ్య సౌరభం.. జీవన రాగం
ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు.. రోగకారక క్రి ములకు సింహస్వప్నంలా నిలుస్తుంది.రక్తంలో చ క్కెరకు అడ్డుకట్ట వేసి.. మధుమేహ బాధితులకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. కొలెస్ట్రాల్ కల్మషాలను కడిగివేసి, గుండె వేగానికి భరోసా ఇస్తుంది. కాలేయాన్ని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. పాలిచ్చే తల్లులకు ఇది గెలాక్టాగోగ్‌గా మారి, పసిబిడ్డలకు పౌష్టికాహార లోపం లేకుండా చూస్తుంది. ఇందులోని బీటా కెరోటిన్ రేచీకటిని తరిమికొట్టి, కంటి చూపును శరత్కాల చంద్రికలా ప్రకాశింపజేస్తుంది.
విలువ ఆధారిత ఉత్పత్తులు..
మునగను కేవలం పంటగా చూడకుండా, ఒక లాభసాటి వ్యాపారంగా మలిచే అద్భుత అవకాశం ఉంది. మునగ ఆకుల పొడి, సుగంధ భరితమైన టీ, చిన్నారుల కోసం న్యూట్రిమిక్స్ రుచికరమైన బిస్కెట్లు, లడ్డూలు.. ఇలా మునగతో తయారయ్యే ప్రతి ఉత్పత్తి ఒక ఆదాయ వనరులాంటిది. గ్రామీణ మహిళా సంఘాలు ఈ విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని చేపడితే వారి ఆర్థిక స్వాలంబనకు ఆకాశమే హద్దని తెలిపారు.


