
ఆధునిక సాగుకు ఆసక్తి
గండేడ్: వ్యవసాయంలో నాడు పశువులు, కూలీలు, ఎద్దులబండ్ల వినియోగం ఉండేది. సాగు అంటేనే సవాలక్ష సమస్యలతో కూడకున్న తరుణంలో యాంత్రీకరణ తోడుకావడం అన్నదాతల కష్టాలు తీరినట్లయింది. ప్రస్తుతం సాగులో చాలావరకు యంత్రాల వినియోగం పెరగడంతో కూలీల కొరత తీరడంతో పాటు సమయం, వ్యయభారం కూడా తగ్గుతోంది.
నాడు పశువులే కీలకం..
నాడు వ్యవసాయంలో దుక్కి దున్నడం మొదలు పంట కోసే వరకు పశువుల వినియోగమే ఎక్కువగా ఉండేది. కరిగెట్లు చేయడం, కోసిన పంటను కూడా ఎద్దులతోనే తొక్కించేవారు. కూలీలు నాటు వేయడం, కలుపు తీయడం, ధాన్యం నూర్పిళ్లు చేయడం చేసేవారు. కూలీలు ధాన్యాన్ని సంచుల్లో నింపితే ఎద్దులబండ్లలో మార్కెట్‌కు తరలించేవారు. గడ్డిని కూలీలు ఎదిరితే ఎద్దులబండ్లలో ఇళ్ల దగ్గరికి తెచ్చుకొనేవారు. కాని ఈ తంతు పూర్తయ్యే వరకు కనీసం వారం నుంచి పది రోజులు పట్టేది. ప్రతి ఇంటి వద్ద పశుసంపద పండటంతో పాడి ఉత్పత్తి కూడా మెరుగ్గా ఉండేది. రాను రాను సాంకేతికతకు అనుగుణంగా మార్పులు రావడంతో వ్యవసాయంలో యంత్రాల వినియోగం క్రమంగా పెరుగుతోంది.
పెద్దవార్వాల్‌లో
హార్వెస్టర్‌తో వరి కోత
మారుతున్న కాలానికి అనుగుణంగా..
మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు వ్యవసాయంలో ప్రతీది యంత్రాలతోనే చేస్తున్నారు. కరిగెట్లు ట్రాక్టర్లు, రోటవేటర్లతో, కలుపు మందుల పిచికారీ యంత్రాలతో చేపడుతున్నారు. పండిన పంటలను సైతం కోయడానికి యంత్రాల ప్రాధాన్యం పెరిగింది. వరి కోత యంత్రాలు అతి తక్కువ సమయంలో పంట కోతలు చేపట్టడంతో పాటు గడ్డి, ధాన్యం వేర్వేరుగా వస్తున్నాయి. యంత్రాలను వినియోగించి తూర్పారబడుతున్నారు. ఒకేరోజు అన్ని పనులు పూర్తవుతుండటంతో రైతులకు వ్యయ భారం తగ్గడంతో పాటు సమయం ఆదా కావడం, డబ్బులు కూడా వెంటనే అందే పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా యంత్రాల వినియోగం పెరిగింది. పాత విధానంలో ఒక ఎకరా పంట శుభ్రం చేయడానికి తక్కువగా వారం రోజుల సమయం పడుతుండగా.. వరి కోత యంత్రమైతే ఒకే గంటలో పూర్తవుతుంది.
అందుబాటులోకి బేలర్‌లు..
వరి పంట కోసిన తర్వాత గడ్డిని దగ్గరగా చేర్చేందుకు చాలా సమయం పట్టేది. కాని ఇటీవల గడ్డిని చుట్టే యంత్రం బేలర్ రావడంతో రైతుల బెంగ తీరింది. హార్వెస్టర్లు కోసిన గడ్డిని బేలర్ సునాయసంగా కట్టలు కడుతుంది. సాధారణంగా రైతులు వినియోగించే ట్రాక్టర్‌కు బేలర్‌ను హైడ్రాలిక్ సిస్టంతో అమర్చుతారు. ఈ యంత్రం గడ్డిని కట్టగా తయారు చేస్తోంది. గతంలో ఎకరా విస్తీర్ణంలో పశుగ్రాసానికి కుప్పగా మార్చడానికి కూలీలకు రూ.వేలు ఖర్చయ్యేది. బేలర్‌తో కట్టకు రూ.35 చొప్పున ఒకరోజులో పది ఎకరాల విస్తీర్ణంలో పశుగ్రాసం కట్టలు కడుతుంది. ఎకరాకు సుమారు రూ.1,800 మాత్రమే ఖర్చవుతుండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు.
యంత్రాల వినియోగానికి మొగ్గుచూపుతున్న అన్నదాతలు
తీరుతున్న ఇక్కట్లు.. సమయం, వ్యయం ఆదా

ఆధునిక సాగుకు ఆసక్తి