
జల్సాలకు అలవాటుపడి చోరీలు
కల్వకుర్తి టౌన్: జల్సాలకు అలవాటు పడి చోరీలను వారి ప్రవృత్తిగా ఎంచుకున్న ముగ్గురు దొంగలను కల్వకుర్తి పోలీసులు పట్టుకున్నారు. శనివారం పట్టణంలోని సీఐ కార్యాలయంలో సీఐ నాగార్జున వివరాలను మీడియాకు వెల్లడించారు. ఊర్కొండ మండలంలోని రాంరెడ్డిపల్లికి చెందిన యాదగిరి, శివకుమార్, కల్వకుర్తి మున్సిపాలిటీలోని సంజాపూర్‌కు చెందిన శ్రీరామ్ ముగ్గురు కలిసి చోరీలు చేసేవారు. వీరంతా కలిసి మండలంలోని తుర్కలపల్లిలో గత నెల 24న దొంగతనం చేశారు. వీరితో పాత నేరస్థుడైన యాదగిరి వేలిముద్రలు అక్కడి స్పాట్‌లో లభించటంతో అతనిని విచారించగా మిగిలిన ఇద్దరి పేర్లు చెప్పగా.. వారిని పట్టుకొని విచారించగా చోరీలను ఒప్పుకున్నారని సీఐ వెల్లడించారు. వీరి వద్ద నుంచి రూ.2.40 లక్షలు నగదు, స్విప్ట్ కారు, మూడు సెల్‌ఫోన్లు, జనగామ జిల్లా పరిధిలో చోరీ చేసిన ఒక మోటారు సైకిల్‌ను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. నిందితులను పట్టుకోవడంతోపాటు వారి వద్ద లభించిన వాటన్నింటిని కోర్టులో ప్రవేశపెట్టగా జడ్జి ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించారన్నారు. అయితే యాదగిరిపై ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని పలు స్టేషన్లలో కేసులు ఉన్నాయని సీఐ వివరించారు. కేసు ఛేదనలో చొరవ చూపిన ఎస్‌ఐలు మాధవరెడ్డి, రామచందర్‌జీ, సిబ్బందిని డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అభినందించారు.