టాస్ కోఆర్డినేటర్ నియామకంపై వివాదం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యాశాఖలో టాస్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ) ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ పోస్టు కేటాయింపు విషయంలో రెండు సంఘాల మధ్య ఫిర్యాదుల పర్వం కొనసాగుతుంది. మొదట జీటీఏ (గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్) నాయకులు టాస్ కోఆర్డినేటర్ నియామకం అక్రమం అని, 1972లో విడుదల చేసిన జీఓ 1214 ప్రకారం కేవలం గవర్నమెంట్ టీచర్స్‌కే కేటాయించాలని స్పష్టంగా ఉన్నప్పటికీ గత డీఈఓ నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలుగా కేటాయించారని నాయకులు పలుమార్లు కలెక్టర్, డీఈఓకు సైతం ఫిర్యాదు చేశారు. కామన్ సర్వీస్ రూల్స్ లేనందున లోకల్ బాడీ వారికి లోకల్ బాడీలో, గవర్నమెంట్ వారికి గవర్నమెంట్‌లో మాత్రమే కేటాయించాలని, డీఈఓ కార్యాలయం పూర్తిగా గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది కాబట్టి లోకల్ బాడీలో ఉన్న ఉపాద్యాయుడికి టాస్ కోఆర్డినేటర్ పోస్టు కేటాయించవద్దని పేర్కొంటున్నారు.
● ఇదిలా ఉండగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పడిన జేఏసీ నాయకులు డీఈఓ ప్రవీణ్‌కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1214 జీఓ ప్రకారం లోకల్ బాడీ, గవర్నమెంట్ బాడీలో వారు ఎవరైనా కూడా ఆ పోస్టుకు అర్హులేని, ఎవరినైనా ఆ పోస్టులో నియమించవచ్చని పేర్కొన్నారు. కొంతమంది కావాలనే ఈ విషయాన్ని వివాదంగా మార్చుతున్నారని, త్వరలోనే దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
● ఈ విషయమై డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా గత జీఓలో గవర్నమెంట్ టీచర్స్ అని ఉందని, అయితే కోఆర్డినేటర్ నియామకంపై గత డీఈఓ విద్యాశాఖ కమిషనర్ సూచన మేరకు పోస్టును కేటాయించామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారన్నారు. దీనిపై ఒక వర్గం గవర్నమెంట్ బాడీకి ఇవ్వాలని, మరో వర్గం లోకల్ బాడీకి ఇవ్వాలని ఫిర్యాదులు చేస్తున్నారని, ఈ విషయమై కమిషనర్‌కు ఫైల్ పంపించామన్నారు. అక్కడి నుంచి స్పష్టత వస్తే ఎవరిని కేటాయించాలనేది తెలుస్తుందని చెప్పారు.
అక్రమంగా కేటాయించారని జీటీఏ సంఘం నాయకుల ఆరోపణ
ఎవరికై నా ఇవ్వొచ్చని
జేఏసీ నాయకుల వాదన
స్పష్టత కోసం విద్యాశాఖ కమిషనర్‌కు ఫైల్ పంపిన డీఈఓ


