టైర్‌ పగిలి ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు .. తాత, మనవడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

టైర్‌ పగిలి ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు .. తాత, మనవడు దుర్మరణం

Mar 18 2025 12:33 AM | Updated on Mar 18 2025 12:31 AM

జడ్చర్ల: ఆకస్మాత్తుగా టైర్‌ పగిలిపోవడంతో అదుపుతప్పిన కారు రోడ్డు డివైడర్‌ను దాటి అవతలి వైపు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టగా ఈ ప్రమాదంలో తాతమనవడు దుర్మణం చెందారు. కూతురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సీఐ కమలాకర్‌ తెలిపారు. వివరాలు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన ఎం.వెంకట్‌రెడ్డి (76) మహబూబ్‌నగర్‌లోని ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. వెంకట్‌రెడ్డి కూతురు హైదరాబాద్‌లోని నార్సింగిలో నివాసం ఉంటున్నారు. సోమవారం వెంకట్‌రెడ్డి కూతురు శ్వేత(45), ఆమె కుమారుడు నిదయ్‌రెడ్డి (22)తో కలిసి హైదరాబాద్‌ నుంచి కారులో జడ్చర్ల వైపు వస్తున్నారు. మాచారం గ్రామం దాటాక జాతీయరహదారిపై ఆకస్మాత్తుగా కారు టైరు పగిలిపోయింది. దీంతో అదుపుతప్పిన కారు డివైడర్‌ను దాటుకుంటూ అవతలి వైపునకు దూసుకెళ్లింది. అదే సమయంలో జడ్చర్ల నుండి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న మహబూబ్‌నగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కారు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్‌ చేస్తున్న శ్వేత, పక్క ఉన్న వెంకట్‌రెడ్డి తీవ్రగాయాలకు గురయ్యారు. నిదయ్‌రెడ్డి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. క్షతగాత్రులను వైద్యచికిత్స కోసం 108 అంబులెన్స్‌లో ఏనుగొండ ఎస్‌వీఎస్‌ ఆస్పత్రికి తరలించారు. కొనఊపిరితో ఉన్న వెంకట్‌రెడ్డి మార్గమధ్యలోనే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రగాయాలకు గురైన శ్వేతను మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రమాద సమయంలో కారులోని బెలూన్లు ఓపెన్‌ కావడంతో డ్రైవర్‌ సీట్లో ఉన్న శ్వేతకు ప్రాణాపాయం తప్పింది. ప్రమాదంలో దుర్మరణం చెందిన వెంకట్‌రెడ్డి సర్వేయర్‌గా పదవీ విరమణ పొందగా నిదయ్‌రెడ్డి బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. శ్వేత సొంత గ్రామం నల్గొండ జిల్లా చండూరు కాగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆమెకు భర్త శేఖర్‌రెడ్డి, ఇద్దరు కుమారులు ఉండగా మృత్యువాత పడిన నిదయ్‌రెడ్డి చిన్నవాడు. ప్రమాద సంఘటనతో ఆకుటుంబం ఒక్కసారిగా దుఖఃసాగరంలో మునిగిపోయింది. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

కారు పూర్తిగా ధ్వంసం..

రోడ్డు ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం అయ్యింది. కారు ఢీకొట్టడంతో ఆర్టీసీ బస్సు కూడా ముందు ఒక భాగం ధ్వంసమైంది. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్‌ అంతరాయాన్ని తొలగించారు.

కూతురి పరిస్థితి విషమం

జడ్చర్ల మండలం మాచారం వద్ద దుర్ఘటన

జాతీయ రహదారిపై స్తంభించిన ట్రాఫిక్‌

 టైర్‌ పగిలి ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు ..  తాత, మనవడ1
1/1

టైర్‌ పగిలి ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు .. తాత, మనవడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement