‘గుర్రంగడ్డ’ పనుల్లో కదలిక | - | Sakshi
Sakshi News home page

‘గుర్రంగడ్డ’ పనుల్లో కదలిక

Mar 18 2025 12:31 AM | Updated on Mar 18 2025 12:30 AM

గద్వాల: ఏడాదిలో ఆర్నెళ్లు దీవిలో.. మరో ఆర్నెళ్లు మైదాన ప్రాంతంలో జీవిస్తున్న గుర్రంగడ్డ వాసుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానది మధ్యలో ఉన్న ఏకై క దీవి గ్రామం గుర్రంగడ్డ. ఈ గ్రామ ప్రజల రాకపోకలకు ఏకై క మార్గం నదిలో పుట్టీల ద్వారా ప్రయాణం చేయడం. దీవిగ్రామ ప్రజల కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వం హయాంలో 2015లో రూ.12 కోట్ల అంచనాలతో వంతెన నిర్మాణ పనులను చేపట్టారు. అయితే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ సకాలంలో పనులు మొదలు పెట్టకపోవడంతో ఏడేళ్లుగా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా పనులు ముందుకు సాగలేదు. తాజాగా అధికారు లు పాత ఏజెన్సీని మార్చేసి కొత్త ఏజెన్సీకి పనులు అప్పచెప్పడంతో పనుల్లో కదలిక మొదలైంది. వచ్చే ఏడాది వరకు పనులు పూర్తి చేసి రాకపోకలు ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు.

● వానాకాలం సీజన్‌లో భారీగా కురిసే వర్షాలకు వరద వచ్చి చేరడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంటుంది. ఈ సమయంలో గుర్రంగడ్డ వాసులు పుట్టీలు, పడవల ద్వారా ప్రయాణించాల్సిందే. ఈక్రమంలో వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నది మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. ఈ గ్రామంలో మొత్తం 600 మంది నివాసం ఉంటుండగా 450 మంది వరకు ఓటర్లున్నారు. మొత్తం వ్యవసాయ భూమి విస్తీర్ణం 2,100 ఎకరాలు కాగా ఇందులో సుమారు 1,600 ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగుచేస్తారు. ఇందులో ప్రధాన పంట వరి. ఇలాంటి పరిస్థితిలో నదిలో భారీగా వరద ప్రవహిస్తున్నప్పుడు బాహ్యప్రపంచంతోదీవి వాసులకు పూర్తిగా సంబంధాలు కోల్పోతాయి. ఏడాదిలో ఆర్నెళ్ల వరకు ఈ కష్టాలు వెంటాడుతుంటాయి.

కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో..

గత ప్రభుత్వం 2018లో రూ.12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని పనులు మొదలుపెట్టింది. అయితే పనుల దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ వచ్చాడు. దీనిపై అధికారులు పలుమార్లు నోటీసులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కాంట్రాక్టర్‌లో చలనం లేదు. దీంతో ఏడేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. తాజాగా సదరు కాంట్రాక్టర్‌పై అధికారులు వేటు వేశారు. 60సీ నోటీసులు జారీ చేసి పాత కాంట్రాక్టర్‌, కన్‌స్ట్రక్షన్‌ ఏజెన్సీని తొలగించి నూతనంగా మరో ఏజెన్సీకి పనులు అప్పగించారు. దీంతో కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీ పనులు మొదలుపెట్టింది. ప్రస్తుతం పనులు వేగవంతంగా సాగుతున్నాయి. వేసవి కాలంలో పనులు వేగవంతం చేసి వంతెన నిర్మాణం పూర్తి చేయాలని.. తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని గుర్రంగడ్డ వాసులు కోరుతున్నారు. ఇన్‌చార్జి ఎస్‌ఈ రహీముద్దీన్‌ మాట్లాడుతూ ‘పనులు నిర్లక్ష్యంచేసిన పాత ఏజెన్సీకి 60సీ నోటీసులు ఇచ్చి తొలగించాం. కొత్త ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు అప్పగించాం. వచ్చే ఏడాది నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.’ అని పేర్కొన్నారు.

గుర్రంగడ్డ వంతెన నిర్మాణ పనులు

నూతన ఏజెన్సీకి వంతెన నిర్మాణ పనులు

కృష్ణానదిలో ఏకై క దీవి గ్రామం..

అత్యవసర పరిస్థితుల్లో నది దాటేందుకు తీవ్ర ఇబ్బందులు

వంతెననిర్మాణంతో తీరనున్న కష్టాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement