దోమలపెంట: అమ్రాబాద్ టైగర్ రిజర్వు పరిధిలోని దోమలపెంట రేంజ్ అటవీ ప్రాంతంలో మంటల వ్యాప్తికి కారణమైన వ్యక్తి శీలం బయన్నను సోమవారం కోర్టులో హాజరుపర్చినట్లు దోమలపెంట ఎఫ్‌ఆర్‌ఓ గురుప్రసాద్ తెలిపారు. ఈ నెల 2, 3 తేదీల్లో దోమలపెంట రేంజ్ పరిధిలోని దూబోడు, ఉల్లిందలూట బీట్లలో రాత్రివేళలో వ్యాపించిన మంటలను జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 7 బృందాలు శ్రమించి అదుపులోకి తెచ్చాయి. అయితే ఇతర ప్రాంతాల్లో మంటలు, పొగలు వస్తుండటంతో అడవిలో అన్ని బ్లాక్‌లను కాలినడక ద్వారా వెళ్లి ఆర్పుతుండగా సమీపంలో నివాసముంటున్న పదర మండలం చిట్లంకుంట గ్రామానికి చెందిన శీలం బయన్న మేకలను కాయడం తారసపడిందన్నారు. అతన్ని విచారించగా లింగాలగట్టుకు చెందిన బాలచెన్నయ్యకు చెందిన మేకలు కాస్తున్నట్లు చెప్పారని, బయన్న వద్ద అగ్గిపెట్టె, బీడీలు, పొగాకును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సుమారు 150 హెక్టార్ల విస్తీర్ణం మేర అడవిలో మంటలు వ్యాపించడానికి శీలం బయన్న కారణమని, కేసు నమోదు చేసి అచ్చంపేట కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి చార్జీషీటు దాఖలు చేయాలని సూచించారన్నారు.