అలంపూర్: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి క్షేత్రం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఆలయ సముదాయంలోని చైర్మన్ చాంబర్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జోగుళాంబ ఆలయ అభివృద్ధిపై ఈ నెల 7న హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా జోగుళాంబ ఆలయ సమగ్ర అభివృద్ధికి తాత్కాలిక, దీర్ఘకాలిక పనుల జాబితాను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికీ అలంపూర్‌లో ఐదవ శక్తిపీఠం ఉన్నట్టు చాలా మందికి తెలియని పరిస్థితి ఉందన్నారు. ఆలయ చరిత్రతో కూడిన ప్రచార బోర్డులు పెట్టడానికి ప్రధాన బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ముఖ్య ప్రదేశాలను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల ఆలయాల్లో అవినీతి జరిగిందని.. అర్చకుల పనితీరుపై మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. అందుకు సంబంధించిన రికార్డులను దేవదాయశాఖకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆలయాల ప్రతిష్ట దెబ్బతిసే విధంగా ఎవరూ ప్రయత్నించవద్దని కోరారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు నాగశిరోమణి, జగన్మోహన్ నాయుడు, జగన్‌గౌడు, గోపాల్, అడ్డాకుల రాము ఉన్నారు.