పోటెత్తిన ఉల్లి | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన ఉల్లి

Mar 6 2025 12:18 AM | Updated on Mar 6 2025 12:17 AM

ఉల్లి కుప్పలతో నిండి న దేవరకద్ర మార్కెట్‌

గరిష్ట ధర రూ. 2,550

కనిష్టంగా రూ. 1,800

దేవరకద్ర: దేవరకద్ర మార్కెట్‌కు బుధవారం ఉల్లి పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు ఉల్లిని పెద్ద ఎత్తున అమ్మకానికి తెచ్చారు. దాదాపు ఐదు వేల బస్తాల ఉల్లి అమ్మకానికి రావడంతో మార్కెట్‌ యార్డు ఆవరణం అంతా ఉల్లి కుప్పలతో నిండిపోయింది. స్థలం సరిపోక గోదాంల పక్కన సీసీ రోడ్డుపై ఉల్లిని కుప్పలుగా పోశారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో కోతలు కోసిన ఉల్లిని రైతులు నేరుగా మార్కెట్‌కు తెస్తున్నారు. దిగుబడులు ఎక్కువగా వస్తుండటంతో ఒక్కో రైతు రెండు నుంచి మూడు ట్రాక్టర్ల ఉల్లిని అమ్మకానికి తెచ్చారు. ఎండలు బాగా ఉండడంతో బాగా ఆరబెట్టిన నాణ్యమైన ఉల్లి మార్కెట్‌కు వచ్చింది.

జోరుగా కొనుగోళ్లు

దేవరకద్ర మార్కెట్లో ఉదయం 10 గంటలకు ప్రారంభమైన వేలం పాటలు మధ్యాహ్నం 2గంటల వరకు కొనసాగింది. ఉల్లి ఎక్కువ రావడంతో వ్యాపారులు ప్రతి కుప్ప వద్దకెళ్లి వేలం పాట పాడాల్సి వచ్చింది. మొదటి రకం ఉల్లికి గరిష్టంగా రూ.2550, కనిష్టంగా రూ.1800 వరకు ధర పలికింది. గత వారంతో పోల్చితే ధరలు నిలకడగానే ఉన్నాయి. స్థానిక వ్యాపారులతో పాటు బయట నుంచి వచ్చిన వ్యాపారులు పోటీపడి ఉల్లిని కొనుగోలు చేశారు. వేలాది బస్తాల ఉల్లిని బయటి వ్యాపారులే ఎక్కువగా ఖరీదు చేశారు. చిరు వ్యాపారులు కూడా చిన్నచిన్న కుప్పలను కొనుగోలు చేశారు. ఇక స్థానిక వ్యాపారులు కొనుగోలు చేసిన ఉల్లిని వినియోగ దారులకు బస్తాలుగా అమ్ముకున్నారు. మార్కెట్‌ నిబంధనల ప్రకారం తూకం వేసిన 45 కేజీల ఉల్లి బస్తా ధర గరిష్టంగా రూ. 1300, కనిష్టంగా రూ. 900 వరకు విక్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement