
నల్లమలలో శాకాహార జంతువుల సర్వే
మన్ననూర్: నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆఫ్ అథారిటీ న్యూఢిల్లీ (ఎన్‌టీసీఏ) వారి ఆదేశాల మేరకు అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలోని నల్లమల ప్రాంతం అమ్రాబాద్, మద్దిమడుగు, మన్ననూర్, దోమలపెంట రేంజ్‌ల పరిధిలో శాకాహార జంతువుల ట్రాన్సెక్ట్ లైన్ సర్వే నిర్వహిస్తున్నారు. మంగళ, బుధ, గురువారాలు మూడు రోజుల పాటు సర్వే కొనసాగుతుందని ఎఫ్‌ఆర్‌ఓ ఈశ్వర్ తెలిపారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వులో (ఏటీఆర్) అమ్రాబాద్, అచ్చంపేట, నాగార్జునసాగర్ మూడు డివిజన్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అచ్చంపేట, నాగార్జునసాగర్ డివిజన్లలో సర్వేలు పూర్తయ్యాయి. మంగళవారం మొదటి రోజు అమ్రాబాద్ డివిజన్‌లో ప్రధానంగా జాతీయ జంతువు పెద్దపులి, చిరుతల వంటి మాంసాహార జంతువులకు ఆహారంగా శాకాహార జంతువులు అటవీ సరిహద్దు ప్రాంతాల్లో ఏ మేరకు ఎక్కడెక్కడ ఉన్నాయని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమ్రాబాద్ డివిజన్ 20,611 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో 140 బిట్లుగా ఏర్పాటు చేశారు. ఈ అటవీ పరిసర ప్రాంతంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ట్రాన్సెక్ట్ లైన్ సర్వే కొనసాగుతుందన్నారు. మొబైల్ డేటా, ఫొటో షూట్ ద్వారా శాకాహార జంతువులు సాంబర్, జింక, చుక్కల దుప్పి, అడవి పందులు తదితర వాటిని గుర్తిస్తామన్నారు. ఈ సర్వే కోసం అటవీ శాఖకు చెందిన 60 మంది సిబ్బందికి ఇది వరకే శిక్షణ ఇచ్చామన్నారు.