
మాట్లాడుతున్న సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి
హన్వాడ: అవగాహనరాహిత్యంతోనే గ్రామాల్లో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గమనించి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి అన్నారు. గురువారం హన్వాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ నేరాలను అదుపు చేయడంలో భాగంగా చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టపరిధిలో నడుచుకోవాలని సూచించారు. చిన్న పిల్లలు వాహనాలను నడపొద్దని, పిల్లలకు వాహనాలు ఇచ్చినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రేమ పేరుతో ఎవరైనా వేధిస్తే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని, 100కు డయల్ చేసి సమాచారం ఇస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యాన్ని పెట్టుకొని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలను పెద్దవిగా చేసుకోవడంతో పాటు కేసులు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజీ మార్గంలో తమ సమస్యలను పరిష్కరించుకునే వెసులుబాటును జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కల్పిస్తుందనే విషయాన్ని తల్లిదండ్రులకు సూచించాలని అన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జడ్జి సంధ్యారాణి నమోదవుతున్న ఓపీ కేసులు, అందిస్తున్న వైద్య సేవలు, మందులు తదితర వివరాలు పీహెచ్‌సీ డాక్టర్ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు.
● స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ఈసీ కల్పిస్తున్న సౌకర్యాలను ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని జడ్జి సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో మోడల్ బ్యాలెట్ ప్రక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం భూసమస్యలు, ధరణి పరిష్కార మార్గాలపై తీసుకుంటున్న చర్యలను తహసీల్దార్ కృష్ణానాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సల్ చీఫ్ రఘుపతి, ఎంపీపీ బాల్‌రాజ్, ఎంపీడీఓ ధనుంజయగౌడ్, మెడికల్ ఆఫీసర్ ప్రగతి, న్యాయవాది రాజేశ్, ప్రిన్సిపాల్స్ యోగేశ్వర్, దీపిక, పారా లీగల్ వలంటీర్లు పల్లెమోని యాదయ్య, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయసేవా అధికార సంస్థకార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి