
గోదం గోడలు పగలగొట్టి మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
నవాబుపేట: రైతులతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్లకు అందించింది. కాగా మిల్లర్లు మార్కెట్ యార్డులో గోదాంలో వాటిని భద్రపరిచారు. కాగా ఆ ధాన్యం నిల్వ ఉంచిన గోదాంలో ఒక్కసారిగా మంటలు రేగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకుని ఆగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో స్థానిక పోలీసుల సాయంతో గోదం గోడలు పగలకొట్టి ధాన్యం ఎక్కువగా అగ్నికి ఆహుతి కాకుండా ఆపగలిగారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని మార్కెట్‌యార్డులోని ధాన్యం గోదాం నుంచి పొగలు వచ్చాయి. దీంతో అక్కడ ఉన్న వ్యాపారులు చూసి పోలీసులకు, ఫైర్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే వారు అప్రమత్తం కావటంతో 12 వేల బస్తాలు ఉంచిన గోదాంను పెద్ద నష్టం జరగకుండా కాపాడారు. ప్రమాదంలో దాదాపుగా 500 బస్తాల వరకు ధాన్యం అగ్నికి ఆహుతి అయ్యింది. నిత్యం అక్కడే ఉండే మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ధాన్యం అగ్నికి ఆహుతి అయ్యిందని, అక్కడ ఉన్న రైతులు వాపోయారు. కాగా బుధవారం మార్కెట్ యార్డులోని ధాన్యం నిల్వ ఉంచిన గోదం పక్కనే చెత్తను చేర్చి మంట పెట్టినట్లు తెలుస్తుంది. ఆ మంటల కారణంగా ధాన్యం గోదాంలోకి మంటలు వ్యాపించాయని రైతులు ఆరోపించారు. నిరంతరం పర్యవేక్షణ చేయాల్సిన మార్కెట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతోనే ఈ ప్రమాదం జరిగిందని రైతులు వాపోతున్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం..
మార్కెట్ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంతోనే ప్రమాదం జరిగిందని చెత్తను ధాన్యం గోదం పక్కన వేసి మంటలు వేస్తే అధికారులు ప్రేక్షకపాత్ర పోషించి ధాన్యం దగ్ధానిక కారణమయ్యారు. మార్కెట్‌లో సీజన్ లేకున్నా.. అధికారుల పర్యవేక్షణ లేకపోవటం చాలా దారుణం. ఈ విషయంలో నిర్లక్ష్యంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.
– లక్ష్మయ్య, మార్కెట్ చైర్మన్ నవాబుపేట
ఫ గోదాంలో నిల్వ ఉంచిన వరిధాన్యం బస్తాలు దగ్ధం
ఫ ఫైర్‌సిబ్బంది, పోలీసుల చొరవతో తప్పిన భారీ నష్టం