
హాజరైన అధికారులు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో కొత్త ఓటరు నమోదు, అభ్యంతరాల పరిష్కారం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన, చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగింపు వంటి కార్యక్రమాలను జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు భారతి లక్పతినాయక్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా ఓటరు జాబితా ప్రతేక సవరణ కార్యక్రమ ప్రక్రియపై కలెక్టర్ రవినాయక్, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, బీఎల్‌ఓలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 28లోగా ఓటరు జాబితాపై వచ్చిన అన్ని అభ్యంతరాలు ఫిర్యాదులను పరిష్కరించి.. అక్టోబర్ 4వ తేదీన ఓటరు తుది జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల వారీగా పరిష్కరించిన అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఈఆర్‌ఓలు వారి పరిధిలో తప్పనిసరిగా ఫారం 6, 7, 8 అన్నింటినీ పరిశీలించాలని, ఓటరు జాబితాలో ఎట్టి పరిస్థితులలో చనిపోయిన ఓటరు పేరు లేకుండా చూసుకోవాలన్నారు. ఫారం–8కి సంబంధించి అధికారులు అన్ని ఆధారాలను పరిశీలించిన తర్వాత జాగ్రత్తగా అప్‌లోడ్ చేయాలన్నారు. కలెక్టర్ రవినాయక్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా ఈసీ ఆదేశాల మేరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణతో పాటు వాటిని పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఓటరు నమోదు విషయంలో ఓటరు అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ దేవరకద్రలో కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకించి కొంతమంది ఓటర్ల పేర్లు తొలగిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని.. అలా కాకుండా పూర్తి పారదర్శకంగా ఓటరు జాబితాలో సవరణలు చేయాలన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు సుధాకర్ మాట్లాడుతూ ఓటు నమోదుపై ముమ్మర అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, ఈఆర్‌ఓ నటరాజు, ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ యాదయ్య, బీఎస్పీ నాయకుడు లక్ష్మయ్య, ఏఈఆర్‌ఓలు, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
