
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని సింహగిరిలో వెలిసిన శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి పద్మావతి శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తుల సమక్షంలో అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణఘట్టాన్ని జరిపించారు. దీంతో ఆలయ పరిసరాలు గోవిందుడి నామస్మరణతో మార్మోగాయి. అంతకుముందు శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు.
‘పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి’
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని సీపీఎస్ జిల్లా అధ్యక్షుడు బాలస్వామి అన్నారు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో జరిగిన సీపీఎస్ యూనియన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు శాపంగా మారిన సీపీఎస్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. మహిళ దినోత్సవ వేడుకలను పురస్కరంచుని ఈనెల 25న స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మహిళ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు తెలిపారు. సమావేశంలో ప్రధానకార్యదర్శి చంద్రకాంత్, కార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, కొండలరావు, పాండు, రాఘవేంద్ర పాల్గొన్నారు.
‘రంజాన్’ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: రంజాన్ మాసం ప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ కె.నరసింహ ఒక ప్రకటనలో శుభకాంక్షలు తెలిపారు.నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు నిర్వహిస్తారని, ఈ క్రమంలో జిల్లాలోని మజీద్‌ల దగ్గర పోలీస్‌శాఖ నుంచి అవసరం అయిన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. భక్తితో ఉపవాస దీక్షలు నిర్వహించుకొని, ఐక్యంగా పండగలు జరుపుకోవాలని సూచించారు.
65,086 మందికి
అంధత్వ లక్షణాలు
పాలమూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో దశ కంటి వెలుగు కార్యక్రమం జిల్లాలో విజయవంతంగా నడుస్తోంది. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి రోజు 45 చోట్ల కంటి వెలుగు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీ వార్డుల్లో, గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాలు, ప్రభుత్వ పాఠశాలలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో కంటి వెలుగు పరీక్షల కోసం మొత్తం 44 వైద్య బృందాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో క్యాంపులు ఏర్పాటు చేసి బాధితులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 6లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా.. ఇప్పటి వరకు 2,75,330 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 65,086మందికి అంధత్వ లక్షణాలు ఉన్నట్లు తేలింది. వీరిలో 38,307 మందికి అద్దాలు అందజేయగా, మరో 26,779మందికి దూరపు చూపు అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు.195 గ్రామ పంచాయతీలు, 45 మున్సిపాలిటీ వార్డులలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారికి కంటి పరీక్షలు పూర్తి చేశారు.
