హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో మంగళవారం సాయంత్రం సంకటహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించుకున్నారు. సాయంత్రం సంకటచతుర్ధిని పురస్కరించుకుని ఆలయంలోని కాకతీయుల కాలం నాటి ఉత్తిష్ట గణపతికి ఓం గం గణపతియేనమః అంటూ గణపతి సూక్త మూలమంత్ర పఠనంతో పంచసూక్తులతో జలాభిషేకం, క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నవరస సుగంధ ద్రవ్యాలతో, హరిద్రాకుంకుమ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. జిల్లేడు పూల దండలతో అలంకరించి గణపతికి ఇష్టమైన గరికతో అష్టోత్తరశతనామాలు పఠిస్తూ షోఢశోపచారపూజలు నిర్వహించారు. మహాహారతి మంత్రపుష్పం జరిపి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


