సాక్షి, మహబూబాబాద్: వలసలను నివారించి ఉన్న ఊరిలోనే పని కల్పించాలనే లక్ష్యంతో చట్టం చేసిన ఉపాధి హామీ పథకంలో జిల్లాలో ఎక్కువ మంది మహిళలే పాల్గొంటున్నారు. గిరిజన గూడాలు, లంబాడ తండాలు, గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాలో పురుషులకు దీటుగా మహిళలు పనిచేస్తున్నారనడానికి ఉపాధి పనుల్లో ఆమె చేసిన పనుల సంఖ్య నిదర్శనంగా ఉంది.
1.19 లక్షల మంది మహిళా కూలీలు
జిల్లాలో 2.15 లక్షల జాబ్ కార్డులు, 4.55 లక్షల మంది ఉపాధి హామీ పథకంలో పనిచేసేందుకు పేరు నమోదు చేసుకున్న కూలీలు ఉన్నారు. ఇందులో 1.42 లక్షల జాబ్‌కార్డులకు సంబంధించిన 2,23,241 లక్షల మంది కూలీలు పనిచేసేవారు ఉన్నారు. ఇందులో 1,03,678 మంది పురుషులు ఉండగా, 1,19,563 మంది మహిళా కూలీలు ఉన్నారు. మొత్తంగా పురుషులకన్నా 15,885 మంది మహిళలు ఉపాధి హామీ పనిలో పాల్గొంటున్నారు.
భర్త వ్యవసాయం, భార్య ఉపాధి పని..
గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లా మహబూబాబాద్. ఇందులో గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలు ఎక్కువ. అందులో ఎకరం, రెండు ఎకరాల వంటి చిన్న కమతాల్లో వ్యవసాయం చేసుకునే కుటుంబాలే అధిక సంఖ్యలో ఉంటారు. ఏప్రిల్, మే నెలల్లో సీ్త్ర, పురుషులు సమానంగా ఉపాఽధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. ఇక జూన్ నుంచి సగం మంది పురుషులు తమ సొంత వ్యవసాయ పనులు చేసుకుంటారు. వ్యవసాయ కూలీలు కూడా అరక దున్నడం, దుగాలు పెట్టడం, మందు కొట్టడం మొదలైన పనులకు వెళ్తే రోజుకు రూ.1,000 మేరకు వస్తాయి. ఇదే ఉపాధి పనికి పోతే నాలుగు గంటలే పని చేయాల్సి వస్తుంది. ఎక్కువలో ఎక్కువ రోజుకు రూ.300 మాత్రమే కూలి వస్తుంది. దీంతో పనులు దొరకక పోతే కానీ పురుషులు ఉపాధి పనికి వెళ్లరు.
అందరితో కలిసి 4 గంటలు..
వేరే పనులకు వెళ్తే పొద్దస్తమానం పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఉపాధి పనులకు వెళ్తే 4 గంటలు పనిచేస్తే సరిపోతుంది. వేసవిలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పనిచేస్తే ఆరోజు కూలి పడుతుంది. దీంతో ఉదయం పూట పనిచేసుకొని వస్తే ఇంటి వద్దనే ఉండవచ్చనే ఆలోచనతో స్త్రీ, పురుషులు తేడా లేకుండా ఉదయాన్నే ఉపాధి పనికి వెళ్తున్నారు. మొత్తంగా చూసుకుంటే.. వందరోజులు పని పూర్తి చేసిన కూలీల జాబితాలో 80శాతం మంది మహిళా కూలీలే ఉండటం గమనార్హం.
●
ఎండాకాలంలో ఉపాధి పనికి వెళ్తాం
ఉపాధి పనులు ఎప్పుడు పెట్టినా కూలీకి వెళ్తా. మాకున్న కొద్దిపాటి భూమిలో అన్నిరోజులు అక్కడ పని దొరకదు. అందుకోసమే ఎండాకాలం అంతా ఉపాధి పనికి వెళ్తాం. మిగిలిన రోజుల్లో మా సొంత వ్యవసాయ పనులు చేసుకుంటాం. ఏడాదికి రూ. 20 వేలకుపైగా కూలి డబ్బులు వస్తాయి.
– భూక్య బుజ్జి, అయోధ్య
కుటుంబానికి ఆసరాగా ఉంటుంది
కూలీ చేసుకుంటేనే కుటుంబం గడుస్తుంది. ప్రతీ నెల ఇంట్లో ఖర్చులు, మహిళా సంఘం చీటీ డబ్బులు కట్టాలి. ప్రతీరోజు వ్యవసాయ పనులు దొరకవు. దుగాలు పెట్టడం, దుక్కి దున్నే పనులకు మగవారినే పిలుస్తారు. వ్యవసాయ పనులు దొరకనప్పుడు ఉపాధి పనికి వెళ్తాం. ఈ డబ్బులు కుటుంబ ఖర్చులకు ఆసరాగా అవుతున్నాయి.
– ఆవుల రాజేశ్వరీ, బయ్యారం
పురుషులకన్నా ఎక్కువ పనిరోజులు వారివే!
వ్యవసాయ సీజన్‌లో మహిళా కూలీలే అధికం
సంవత్సరానికి రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఆదాయం


