మహబూబాబాద్: స్వీయగణన ప్రతిఒక్కరూ బాధ్యతగా భావించి వివరాలను నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్, అదనపు జనాభా గణన అధికారి కె.అనిల్‌కుమార్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని పలు శాఖల అధికారులు, సిబ్బంది స్వీయగణనలో మంగళవారం వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పోలీస్‌శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖలో పని చేసే అధికారులు, సిబ్బంది స్వీయగణన పూర్తి చేశారన్నారు. ప్రజలు కూడా స్వీయగణన, జనభాగణన విషయంలో పూర్తిగా సహకరించాలన్నారు.
భద్రతా ప్రమాణాలు పాటించాలి
మహబూబాబాద్ రూరల్ : బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు, జ్యూయలరీ షాపుల యజమానులు భద్రతా ప్రమాణాలు పాటించాలని పోలీసులు సూచించారు. ఇటీవల కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన జ్యూయలరీ షాప్ దోపిడీని దృష్టిలో ఉంచుకుని మహబూబాబాద్ పట్టణంలోని బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు, జ్యూయలరీ షాప్ యజమానులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టౌన్ ఇన్‌చార్జ్ సీఐ ఎన్. అంజలీ మాట్లాడుతూ బ్యాంకులు, గోల్డ్ లోన్ ఫైనాన్స్ సంస్థలు, జ్యూయలరీ షాపుల యజమానులు వ్యాపార సముదాయల్లో భద్రతా ప్రమాణాలను పెంచాలన్నారు. ముఖ్యంగా అన్ని గోల్డ్ లోన్ ఫైనాన్స్ ఆఫీసుల్లో, స్ట్రాంగ్ రూముల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన సెక్యూరిటీ అలారాలు, మోషన్ సెన్సార్లు, సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బంగారం తాకట్టు పెట్టే ముందు కస్టమర్ వివరాలను, వారి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బంగారు కొనుగోలు బిల్లులను తనిఖీ చేయాలని, తాకట్టు పెట్టిన బంగారాన్ని సురక్షితమైన లాకర్లలో భద్రపరచాలన్నారు. ఈ సమావేశంలో టౌన్ ఎస్సైలు రాంచరణ్, షాకీర్, బ్యాంకు, ఫైనాన్స్ మేనేజర్లు, జ్యూయలరీ షాప్ యజమానులు పాల్గొన్నారు.
డీఆర్‌ఓగా జుబేదున్సీసా బేగం
మహబూబాబాద్: జిల్లా రెవెన్యూ అఽధికారి (డీఆర్‌ఓ)గా జుబేదున్సీసా బేగంను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది అదనపు కలెక్టర్లను, డీఆర్‌ఓలను, ఆర్డీలను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర మైనార్టీశాఖలో విధులు నిర్వహిస్తున్న జుబేదున్సీసా బేగంను మానుకోట జిల్లా డీఆర్‌ఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రైతు మేళాకు తరలిన రైతులు
మహబూబాబాద్ రూరల్: ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆవరణ జరిగే రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా 2026 కార్యక్రమానికి జిల్లా కేంద్రం నుంచి రైతులు మంగళవారం తరలివెళ్లారు. ప్రత్యేక బస్సుల ద్వారా వ్యవసాయ అధికారులు రైతు మేళాకు తీసుకెళ్లారు.
పీఏసీఎస్‌లకు పర్సనల్ ఇన్‌చార్జ్‌లు
హసన్‌పర్తి: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)కు పర్సనల్ ఇన్‌చార్జ్‌లను నియమిస్తూ రాష్ట్ర సహకారశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది కొనసాగిన మేనేజింగ్ కమిటీలను పర్సనల్ ఇన్‌చార్జీలుగా కొనసాగించాలని హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. తుదిపరి ఆదేశాలు వచ్చేవరకు పర్సనల్ ఇన్‌చార్జ్‌లు కొనసాగుతారని పేర్కొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 94 సొసైటీలకు గతేడాది వరకు చైర్మన్‌లుగా వ్యవహరించిన వారే పర్సనల్ ఇన్‌చార్జ్‌లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. మంగళవారం కొన్ని సంఘాలకు బాధ్యతలు చేపట్టారు. అన్ని విధులు నిర్వహించడానికి, సంఘాల ప్రయోజనాల దృష్ట్యా అవసరమైన అన్ని చర్యలూ ఈ కమిటీలు తీసుకోవచ్చని సహకారశాఖ పేర్కొంది.


