రైతులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు.. | - | Sakshi
Sakshi News home page

రైతులను మోసగిస్తే ఉపేక్షించేది లేదు..

May 6 2026 9:19 AM | Updated on May 6 2026 9:19 AM

అడిషనల్‌ కలెక్టర్‌ అనిల్‌కుమార్‌

తొర్రూరు: ధాన్యం కొనుగోలు విషయంలో రైస్‌ మిల్లర్లు రైతులను మోసగిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ స్పష్టం చేశారు. డివిజన్‌ కేంద్రంలోని విజయలక్ష్మీ రైస్‌ మిల్లును మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అడిషనల్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ రైస్‌ మిల్లర్లు తరుగు తీయొద్దని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా దిగుమతి చేసుకోవాలన్నారు. మ్యాచర్‌ పేరుతో 17 శాతం కంటే ఎక్కువగా 19, 20 శాతం వస్తుందని రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని తెలిపారు. లారీల నుంచి ధాన్యం అన్‌లోడ్‌ చేయకుండా నిలిపివేయవద్దన్నారు. తడిసిన, మొలకలు వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ అధికారి రమేష్‌, మేనేజర్‌ నరసింహరావు, డీఎం వెంకటేశ్వర్లు, డీటీ నర్సయ్య, ఆర్‌ఐ నజీముద్దీన్‌, మిల్లు నిర్వాహకులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

పెద్దవంగర/దంతాలపల్లి: కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్‌ మిల్లులకు తరలించాలని, ఇందుకోసం లారీలు, హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ అధికారులను హెచ్చరించారు. మంగళవారం పెద్దవంగర, దంతాలపల్లి మండలాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా సివిల్‌ సప్లయీస్‌ అధికారులు రమేష్‌, మేనేజర్‌ నరసింహరావులతో కలిసి అదనపు కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాతావరణ మార్పుల కారణంగా టార్పాలిన్లు, గన్నీ సంచులు, క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాల కొరత లేకుండా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ఏమైన సమస్యలు, అవకతవకలు జరిగితే కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, హెల్ప్‌లైన్‌ నంబర్‌ 79950 507 89కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ వినోద్‌ కుమార్‌, ఆర్‌ఐ లష్కర్‌, నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement