హన్మకొండ: రైతులను ఆధునిక వ్యవసాయం వైపు మళ్లించడానికి హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రభుత్వం మూడురోజుల పాటు రాష్ట్ర మెగా రైతు మేళా నిర్వహిస్తోంది. ఇందులో వివిధ రకాల స్టాళ్లు ఏర్పాటు చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్థక శాఖ, సాంకేతిక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో యంత్రాలతోపాటు, నూతన వంగడాలు, డ్రో న్ల ద్వారా మందుల పిచికారీ, పశు సంపద పెంపు, సూక్ష సేద్యంలో వస్తున్న నూతన సాంకేతిక పద్ధతులు, నానో ఎరువుల వినియోగం వంటి స్టాళ్లు ఏర్పాటు చేశారు. రైతులు ఇందులోకి వెళ్లి తమకు కావాల్సిన వివరాలు నిర్వాహకులను అడిగి తెలుసుకుని అవగాహన పెంచుకున్నారు.
సీడ్ ప్లాంటర్..
మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేసే సీడ్ ప్లాంటర్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ఆయా పంటల విత్తనాలను ఎరువుతో సహా విత్తుకోవచ్చు. దీని విలువ రూ.2 లక్షల వరకు ఉంటుందని కంపెనీ బాధ్యులు తెలిపారు. దీని వల్ల శ్రమ, కూలీల కొరత తగ్గుతుంది. విత్తనాలు క్రమ పద్ధతిలో వేసుకోవచ్చు, ఎంత దూరం.. ఎంత లోతులో విత్తుకునే విధంగా అమర్చుకునే వెసులుబాటు ఉంది.
మేజ్ కలెక్టర్..
మొక్కజొన్న పంట కోసేందుకు యంత్రం అందుబాటులోకి వచ్చింది. ట్రాక్టర్ సాయంతో ఇది పని చేస్తుంది. 40 నిమిషాల్లో ఎకరం పంట కోయొచ్చు. ఈ మేజ్ కలెక్టర్ విలువ రూ.9 లక్షలు. దీనిని ట్రాక్టర్ అమర్చుకోవడం ద్వారా పని చేస్తుంది. ఏ ట్రాక్టర్‌కై నా దీనిని అమర్చవచ్చు. కూలీల కొరత బాధ తప్పుతుంది. ఖర్చులు తగ్గుతాయి.
సోలార్ విద్యుత్ మోటారు..
సౌరశక్తి ద్వారా నడిచే విద్యుత్ మోటారు అందుబాటులోకి వచ్చింది. బావుల వద్ద సౌర ఫలకలు అమర్చి ఈ మోటారును నడుపుకోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం రెడ్‌కో ద్వారా ఎంపిక చేసిన గ్రామాల్లో సోలార్ మోటార్ల కోసం సౌర ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 7.5 కిల వాట్ల సౌర ఫలకలు అమర్చుతారు. దీని కోసం ప్రభుత్వం రూ.4.90 లక్షలు ఖర్చు చేస్తుంది. అవగాహన కోసం మేళాలో సోలార్ మోటారును మేళాలో ఏర్పాటు చేశామని రెడ్‌కో హనుమకొండ జిల్లా మేనేజర్ మహేందర్ రెడ్డి తెలిపారు.
సోలనైడ్‌వాల్వ్..
రోజురోజకూ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది. నూతన సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోలనైడ్ వాల్వ్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటి వరకు విద్యుత్ మోటార్లు ఆటో స్టాటర్ల ద్వారా, సెల్ ఫోన్ ద్వారా విద్యుత్ మోటారు ఆన్, ఆఫ్ చేసే విధానం చూశాం. ఇప్పుడు పైపు లైన్లకు బిగించే వాల్వ్‌లను సెల్‌ఫోన్ ద్వారా ఆపరేట్ చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. పైపులైన్‌లో బిగించే సోలనైడ్ వాల్వ్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న ప్రత్యేక యాప్ ద్వారా ఆపరేట్ చేసే విధానం అందుబాటులోకి వచ్చింది. ఎటు వైపు నీరు వెళ్లాలని భావిస్తే ఆటు వైపు మళ్లించేలా వాల్వ్ ఆన్, ఆఫ్ చేయొచ్చు. దీనికి కేంద్ర ప్రభుత్వం 50 శాతం రాయితీ అందిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ రాయితీ అందుతోంది. త్వరలో తెలంగాణలో అందించేందుకు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనున్నాయి.
ఆకట్టుకుంటున్న పుంగనూరు జాతి పశువులు..
మెగా రైతు మేళాలో ప్రదర్శనకు తీసుకొచ్చి న పుంగనూరు జాతి పశువులు రైతులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం 2 నుంచి 3 అడుగులు ఎత్తు ఉండే అత్యంత పొట్టి, అరుదైన, ప్రసిద్ధిగాంచిన దేశవాళి జాతి ఈ పుంగనూరు పశువులు. వీటిని అలంకార ప్రాయంగా పెంచుకుంటారు. ఇంటి అలంకరణకు, గోపూజకు వీటికి ప్రాధాన్యం ఇస్తారు. తక్కువ మేత అవసరం. వీటి మార్కెట్ విలువ రూ.3 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. ఆరు నెలల దూడకు రూ.1.50 లక్షల వరకు ఉంటుందని పశు వైద్యులు తెలిపారు.
వివిధ రకాల వ్యవసాయ ఉత్పత్తులు,
యంత్ర పరికరాలతో ఆకట్టుకున్న స్టాళ్లు
సందర్శించి వివరాలు తెలుసుకున్న
అన్నదాతలు


