● ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి
బచ్చన్నపేట : ఆయిల్ పామ్ సాగుతో రైతులకు భరోసా కలుగుతుందని ఆయిల్ ఫెడ్ రాష్ట్ర చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో రైతుకు 30 ఏళ్ల భరోసా కలుగుతుందన్నారు. ప్రస్తుతం ఖమ్మం, సిద్దిపేట జిల్లాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు ఉన్నాయని, భవిష్యత్‌లో ఎక్కువ విస్తీర్ణంలో ఈ పంటను సాగు చేస్తే జనగామ జిల్లాలో ఫ్యాక్టరీ పెట్టుకుందామని, అందుకు గానూ సిద్దెంకిలో దాదాపు 55 ఎకరాల భూమిని కూడా సేకరించామన్నారు. గోదావరి జలాలను తీసుకురావడానికి మన ప్రాంతంలో కాల్వలు తవ్వించి సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. అందుకే మన ప్రాంతంలో వరి పుష్కలంగా సాగువుతోందన్నారు. అనంతరం ఆయిల్‌పామ్ మొక్కలను పరిశీలించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణిశ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్లు బనుక శివరాజ్‌యాదవ్, నల్ల నాగుల శ్వేతవెంకటాచారి, కిసాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ నిడిగొండ శ్రీనివాస్, ఆయిల్‌ఫెడ్ జిల్లా ఇన్‌చార్జ్ దయాకర్, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు ఇజ్జగిరి రాములు, ఎండీ. ఫిరోజ్, తదితరులు పాల్గొన్నారు.


