డీడబ్ల్యూఓ ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీ | - | Sakshi
Sakshi News home page

డీడబ్ల్యూఓ ఆఫీస్‌లో ఏసీబీ తనిఖీ

May 6 2026 9:19 AM | Updated on May 6 2026 9:19 AM

కాళోజీ సెంటర్‌ : మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ వరంగల్‌ జిల్లా శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీ చేపట్టారు. ఉదయం సుమారు 11.30 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య నేతృత్వంలో అధికారులు ఆఫీస్‌లోకి ప్రవేశించి ఫైళ్లు తనిఖీ చేశారు. కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు తీరుపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. గతంలో జిల్లా సంక్షేమ శాఖలో చేపట్టిన నియామకాల్లో అర్హులకు అన్యాయం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తిన ఘటనలు ఉన్నాయి. ‘కొత్త మిషన్‌ శక్తి’ పథకం కింద డిస్ట్రిక్‌ హబ్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ ఉమెన్‌కు సంబంధించిన నాలుగు కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల విషయంపై చర్చ జరిగింది. ఈ విషయాలపై ‘అకడమిక్‌ మార్కులున్నా అంతే, సంక్షేమ శాఖ పోస్టుల భర్తీలో గందరగోళం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురించరితమైంది. ఇవే కాకుండా తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలకు పప్పు సరఫరా చేసే టెండర్‌ విషయంలో డీడబ్ల్యూఓ ఏకపక్షంగా తనకు నచ్చిన వ్యక్తికి కట్టబెట్టి తర్వాత రద్దు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఏసీబీ అధికారుల తనిఖీతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను వివరణ కోరగా కేంద్ర, రాష్ట్ర పథకాల అమలు అంశంపై ఫైళ్లు తనిఖీ చేస్తున్నామని చెప్పారు.

అనుమానమున్న ఫైళ్లు తీసుకెళ్లిన అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement