● పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించిన కేటీఆర్
నర్సంపేట: ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కుటుంబాన్ని కేటీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు మంగళవారం పరామర్శించారు. ముత్తోజిపేటలోని శంకర్‌గౌడ్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్.. పార్టీ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో కార్మికుల సమస్యలను కేబినెట్‌లో చర్చించి, ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడంతో నర్సంపేట ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు నర్సంపేటకు వచ్చి ఆయన కుటుంబానికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తే అరెస్టు చేశారన్నారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని 12 పోలీస్‌స్టేషన్లకు తిప్పి చివరికి ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లి నిర్బంధించారని పేర్కొన్నారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వస్తున్నామని తెలిసి ప్రభుత్వం రూ.10 లక్షలు ఆయన కుటుంబానికి ఇచ్చిందని ఆరోపించారు. మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత పాల్గొన్నారు.


