డోర్నకల్: డోర్నకల్ మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పుడుతున్నారు. అయితే మున్సిపాలిటీ అధికారులు, పాలకవర్గం పట్టించుకోవడం లేదు. సమస్యలపై ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపడం లేదు. దీంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
నిత్యం తాగునీటి ఇబ్బందులు...
మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో ప్రజలు నిత్యం తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమృత్ పథకంలో భాగంగా పైప్‌లైన్ ఏర్పాటు కోసం తవ్వకాలు జరుపుతుండడంతో తరచూ పలు వార్డుల్లో తాగునీటి సరఫరా నిలిచి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.15కోట్ల నిధులతో పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన డ్రెయినేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు జరపడంతో పైపులు పగిలి తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఎండాకాలం నీటి సరఫరా సక్రమంగా జరగకపోవడంతో ప్రజలు వాటర్ ప్లాంట్లలో నీటిని కొనుగోలు చేస్తున్నారు.
నత్తనడకన అభివృద్ధి పనులు..
ప్రస్తుతం అమృత్ పథకంతో పాటు రూ.15 కోట్ల నిధులతో చేపట్టిన డ్రెయినేజీ, సీసీ రోడ్ల పనులు నత్తనడకన సాగుతున్నాయి. అయితే నూతన రోడ్ల కోసం పాత రోడ్లను ధ్వంసం చేసి పనులు పూర్తి చేయకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ధ్వంసమైన రోడ్ల నుంచి దుమ్ము , ధూళి వస్తుండడంతో స్థానికులు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్లు వెడల్పు, డ్రెయినేజీ నిర్మాణాల కోసం కొంతమంది తమ ఇంటి ముందు స్థలాలు ఇచ్చేందుకు అభ్యంతరం తెలుపుతుండడంతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది.
దుర్గంధం..
వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులు పలు కారణాలతో మధ్యలోనే నిలిపివేయడంతో మురుగునీరు, వ్యర్థాలు డ్రెయినేజీల్లో నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ సిబ్బంది పలు వార్డుల్లో చెత్త సేకరణతో పాటు డ్రెయినేజీల్లో చెత్త తొలగించే పనులు నిలిపివేయడంతో వీధులు, డ్రెయినేజీల్లో చెత్త, మురుగు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది.
పట్టించుకోని పాలకవర్గం, మున్సిపల్ సిబ్బంది..
మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో ప్రజలు తాగునీరు, పారిశుద్ధ్యం, అస్తవ్యస్తమైన రహదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. పాలకవర్గం, మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. నత్తనడకన సాగుతున్న అభివృద్ధి పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. అధికారులెవరూ పనులను కనీసం పరిశీలించడం లేదు. వీధుల్లో తాగునీరు దొరకడం లేదంటూ ప్రజలు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు మొరపెట్టుకుంటున్నా.. వారు పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష పార్టీలైతే పత్తా లేకుండా పోయాయి. బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ సమస్యలపై నోరు మెదపడం లేదు. అధికారులు, మున్సిపాలిటీ పాలకవర్గం వెంటనే స్పందించి వార్డుల్లో పర్యటించి అభివృద్ధి పనులు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, తాగునీటి సరఫరా క్రమబద్ధీకరించి, పారిశుద్ధ్య సమస్య ను వెంటనే పరిష్కరించాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.
నరకయాతన అనుభవిస్తున్నాం..
ధ్వంసమైన రోడ్లు, డ్రెయినేజీల్లో నిలిచిన మురుగునీటితో నరకయాతన అనుభవిస్తున్నాం. అభవృద్ధి పనుల పేరుతో నెలల తరబడి పనులు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పైపులు పగిలి నీరు వృథాగా పోతూ తాగునీరందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. మున్సిపాలిటీ పాలకవర్గం, అధికారులు పట్టించుకోవడం లేదు.
– ఎస్‌కె ఖాజా, కూరగాయల వ్యాపారి
1
4
3
2
డోర్నకల్‌లో అరకొరగా తాగునీటి సరఫరా
నత్తనడకన అభివృద్ధి పనులు
పారిశుద్ధ్యం, ధ్వంసమైన రహదారులతో ఇబ్బందులు
పత్తాలేని మున్సిపల్
అధికారులు, పాలకవర్గం


