సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ పనితీరుకు కొలమానంగా ఉండే విద్యాశాఖలో వింత పరిస్థితి నెలకొంది. ఎవరైనా పదోన్నతి ఇచ్చి జిల్లా అధికారిగా పనిచేయమంటే ఉత్సాహంగా విధుల్లో చేరుతారు. కానీ, మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికా రిగా పనిచేయాలంటే మాత్రం అధికారులు భయపడుతున్నారు. మేం ఇక్కడ పని చేయలేమని వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితిలో రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణమూర్తి మానుకోట విద్యాశాఖ అధికారిగా అదనపు బాధ్యతలు తీసుకోవడం చర్చగా మారింది.
ఈ జిల్లాలో పనిచేయలేం..
మొదటి నుంచి మహబూబాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా పనిచేయాలంటే సహసమే అనే ప్రచా రం ఉంది. ఈమేరకు ఇప్పటి వరకు జిల్లాకు వచ్చిన నాగేశ్వర్‌రావు కొద్దికాలంలోనే పదవీ విరమణ పొందారు. తర్వాత వచ్చిన సోమశేఖర శర్మ తనదైన శైలిలో పనిచేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన రామారావు పనిచేసిన కాలంలో కార్యాలయంలో గొడవ లేని రోజు లేదు. దీనిలో భాగంగానే ఆయనను విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో వచ్చిన రవీందర్ రెడ్డి గతంలో ఇక్కడ పనిచేసిన అనుభవంతో ఒక వైపు అకాడమిక్, మరోవైపు అడ్మినిస్ట్రేషన్‌ను సరిదిద్దారు. ఆయన ప్రయత్నం ఫలించి గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపారు. ఆయన పదవీ విరమణ పొందడంతో ఖాళీ అయిన డీఈఓ సీటుకు సరిగ్గా మూడు నెలల క్రితం సూర్యాపేట ఏడీగా పనిచేసిన దక్షిణామూర్తి బదిలీపై వచ్చారు. వచ్చిన కొద్దిరోజులు ఉత్సాహంగా పనిచేసిన ఆయన తర్వాత జిల్లా నుంచి ఎప్పుడు వెళ్దాం అనే పనిలోనే ఉన్నట్లు విద్యాశాఖ ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా సర్వీస్ ఉండగానే వీఆర్‌ఎస్ పెట్టుకొని వెళ్లిపోయారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న ఏడీ రాజేశ్వర్ ఖమ్మం ఏడీగా బదిలీ అయ్యారు. ఆయన ఇక్కడ డీఈఓగా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంలో.. ఏం జరిగిందో ఏమో కాని నేను పనిచేయలేను.. నా ఆరోగ్యం బాగాలేదని మూడు నెలలు సెలవు పెట్టి వెళ్లిపోయారు.
నూతన డీఈఓగా సత్యనారాయణ మూర్తి
ప్రస్తుతం జిల్లావిద్యాశాఖ అధికారిగా పనిచేస్తున్న రాజేశ్వర్ దీర్ఘకాలిక సెలవులపై వెళ్లారు. దీంతో ఏడీగా పని చేస్తున్న సత్యనారాయణమూర్తికి మానుకోట డీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే సత్యనారాయణ మూర్తి జనగామ జిల్లా ఏడీగా పనిచేసిన కాలంలో అక్కడి కలెక్టర్ రాష్ట్ర విద్యాశాఖకు బదిలీ చేశారు. కాగా ఆయన పనితీరు ఎలా ఉంటుందో అనేది జిల్లాలో చర్చగా మారింది.
భయం ఎందుకంటే..
జిల్లా విద్యాశాఖ అధికారి దక్షిణామూర్తి ఉన్నట్టుండి వీఆర్‌ఎస్ పెట్టుకోవడంపై జిల్లా అధికారుల్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కార్యాలయంలోని ఉద్యోగులు రెండు వర్గాలుగా విడిపోవడం, సమయ పాలన పాటించకపోవడం.. కొందరు కో–ఆర్డినేటర్లు పనిచేయకుండా రాజకీయాలు చేయడం, అత్యవసర సమయాల్లో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండటం, తాము వచ్చిందే సమయం అన్నట్లు కార్యాలయానికి రావడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీనికి తోడు జిల్లాలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో సమస్యలు తిష్ట వేయడంతో ప్రతీరోజు ఏదో ఒక సమస్య వస్తుంది. మరోవైపు నాన్‌టీచింగ్ ఉద్యోగుల కొరతతో విద్యార్థులకు సక్రమంగా భోజనం వండి పెట్టకపోవడం, అపరిశుభ్రమైన వాతావరణం, ఇదేంటి అని అడిగితే రాజకీయ పార్టీల నాయకుల నుంచి ఫోన్లు చేయించి బెదిరించిన సంఘటనలు ఉన్నట్లు ప్రచారం.. ఇన్ని సమస్యల మధ్య డీఈఓగా ఇక్కడ పని చేసేందుకు భయపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
డీఈఓగా పని చేసేందుకు అధికారుల ససేమిరా
ఇప్పటికే పనిచేయలేమని తప్పుకున్న ముగ్గురు అధికారులు
నూతన డీఈఓగా సత్యనారాయణ మూర్తి


