మహబూబాబాద్ రూరల్ : కార్మికులు బీమా చేయించుకుని ధీమాగా బతకాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని (మే డే) పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో భవన నిర్మాణ రంగ కార్మికులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఆయన కార్మికులకు కార్డులు అందజేసి మాట్లాడారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడుమామిడాల సత్యనారాయణ, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి.రాజ్ కృష్ణ, పలువురు పారా లీగల్ వలంటీర్లు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.
మక్కల కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
నర్సింహులపేట: కొనుగోలు కేంద్రాల్లో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, మక్కల కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆమె సందర్శించి పరిశీలించారు. మక్కల కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయని రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులు ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా కాంటాలు పెట్టాలని ఫోన్‌లో అధికారులతో మాట్లాడారు. రైతులు మక్కలు తీసుకొచ్చి నెల దాటుతున్నా ఇప్పటి వరకు కాంటాలు కాలేదని, ఎప్పుడు జరుగుతాయని అడిగారు. రైతులకు ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె వెంట బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలి
వరంగల్ క్రైం: పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ల నుంచి ఏసీపీలుగా పదోన్నతి పొందిన గొర్ల సీతా రెడ్డి, బోలగాని శ్రీనివాస్‌గౌడ్, సార్ల రాజు శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్‌ను సీపీ క్యాంపు కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని, నిరంతరం కింది స్థాయి అధికారుల పని తీరును పర్యవేక్షించడంతో పాటు వారికి దిశానిర్దేశం చేయాలని, పోలీస్ శాఖ గౌరవ మర్యాదలు పెంపొందించేలా విధులు నిర్వర్తించాలని సీపీ.. అధికారులకు సూచించారు.
నైపుణ్యాలదే కీలక పాత్ర
కేయూ క్యాంపస్: ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాల సాధనలో నైపుణ్యాలే కీలకపాత్ర పోషిస్తాయని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి అన్నారు. కేయూలోని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో వివిధ బ్రాంచ్‌ల ఫైనల్ ఇయర్ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో వివిధ ఉద్యోగాలు సాధించారు. శుక్రవారం ఆయా విద్యార్థులకు పరిపాలనా భవనంలోని సెనేట్‌హాల్‌లో అభినందన సభ నిర్వహించారు. కళాశాలలోని ఫైనల్ ఇయర్ విద్యార్థినుల్లో సుమారు 250 మంది వివిధ కంపెనీల్లో ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాలు పొందగా వారిని అభినందించారు.
కాజీపేట రైల్వే పిట్ లైన్ల తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే పిట్ లైన్లను శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ (డీఆర్‌ఎం) గోపాలకృష్ణన్ తనిఖీ చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో అధికా రుల బృందంతో కలిసి డీజిల్ షెడ్ వద్ద రైలు దిగి పిట్ లైన్లను తనిఖీ చేశారు. రైళ్ల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఆర్‌ఎం డీజిల్ కాలనీలోని రైల్వే కమ్యూనిటీ హాల్, రైల్వే చిల్డ్రన్ పార్కును తనిఖీ చేశారు. ఈనెల 10న ప్రధాన మంత్రి మోదీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వర్చువల్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో.. రైల్వే అధికారులు రైల్వే కమ్యూనిటీ హాల్‌లో ఉండేందుకు కావాల్సిన సౌకర్యాలపై అధికారులతో చర్చించారు. అనంతరం ప్రత్యేక రైలులో డీఆర్‌ఎం కాజీపేట మీదుగా పెద్దపల్లి, నిజామాబాద్‌కు తనిఖీల నిమిత్తం వెళ్లారు.


