మహబూబాబాద్ రూరల్ : కాంగ్రెస్ ప్రభుత్వం వరి రైతులపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి అసలైన రైతు ద్రోహి అని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మహబూబాబాద్ మండలంలోని ముడుపుగల్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్సీ శుక్రవారం సందర్శించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ప్రభుత్వం సకాలంలో వడ్లు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆన్‌లైన్ ప్రక్రియ పేరుతో రైతులను గందరగోళానికి గురిచేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో క్వింటాకు ఐదు కిలోల వరకు తరుగు తీస్తూ రైతుల పొట్ట కొడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, జెర్రిపోతుల వెంకన్న, బానోతు రవికుమార్, అజయ్, వెంకటాద్రి, బీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు బయ్య లింగయ్య, కార్యదర్శి పోతులూరు చారి, వేముల కృష్ణ, జేరిపోతుల ఉపేందర్, మద్ది వెంకటరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు


