వడదెబ్బతో వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

పోతుగల్లులో..

మొగుళ్లపల్లి: వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని పోతుగల్లులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం పోతుగల్లుకు చెందిన మునిగాల చందర్‌ (40) రోజువారీలాగే ఉదయం కూలీపనికి వెళ్లొచ్చాడు. అనంతరం సమీప బంధువు దుబ్యాల గ్రామానికి చెందిన సుజాత గురువారం వడదెబ్బతో మృతి చెందగా ఆమె అంత్యక్రియలకు హాజరై ఇంటికి వచ్చాడు. తీవ్రమైన ఎండలో ప్రయాణించడంతో వడదెబ్బకు గురై రాత్రి మృతి చెందాడు. కాగా మృతుడు చందర్‌కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చందర్‌ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని సర్పంచ్‌ తిరుపతి పరామర్శించి రూ.4వేలు సాయం అందించారు.

కళ్లెం గ్రామంలో..

లింగాలఘణపురం : మండలంలోని కళ్లెం గ్రామాని కి చెందిన కొమ్మరాజుల నర్సింహులు (55 ) వడదెబ్బతో శుక్రవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్సింహులు రెండు రోజులుగా గ్రామంలో ఓ ఇంటి నిర్మాణ పనికి వెళ్తున్నాడు. శుక్రవారం ఉదయం పనికి వెళ్లిన నర్సింహులు ఒక్కసారిగా పడిపోయాడు. గమనించిన తోటి కూలీలు వెంటనే జనగామకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. వడదెబ్బతో చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

బండౌతపురంలో..

వర్ధన్నపేట: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలంలోని బండౌతపురం గ్రామానికి చెందిన మరుపట్ల సోమయ్య(55) వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బండౌతపురం గ్రామానికి చెందిన మరుపట్ల సోమయ్య కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. ఇందులో భాగంగా గురువారం కూలీ పనులకు వెళ్లాడు. ఎండ దెబ్బ తగిలి సాయంత్రం ఇంటికి వచ్చి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. రాత్రి ఇంట్లో నిద్రపోయాడు. శుక్రవారం తెల్లవారు జామున నిద్రలేవకపోవడంతో కుటుంబ సభ్యులు చూడగా అప్పటికే మృతి చెందాడు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. గతకొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో కొడుతున్న ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈక్రమంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక ముగ్గురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Advertisement
 
Advertisement
Advertisement