ఆర్‌టీఎం పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ఆర్‌టీఎం పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

May 2 2026 8:20 AM | Updated on May 2 2026 8:20 AM

పదవీ విరమణ చేసిన అధికారులకు అవకాశం

హన్మకొండ అర్బన్‌: హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ హెచ్‌ఆర్డీ ఇనిస్టిట్యూట్‌ సూచనల మేరకు హనుమకొండ ట్రైనింగ్‌ సెంటర్‌కు రీజినల్‌ ట్రైనింగ్‌ మేనేజర్ల (ఆర్‌టీఎం) ఎంపిక కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. ఇటీవల పదవీ విరమణ చేసిన ఆర్డీఓ, పీడీ, డీఆర్‌డీఏ, డీడీ కేడర్‌కు చెందిన అధికారులు, పూర్వ వరంగల్‌ జిల్లాలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకున్న వారు తమ దరఖాస్తులను శనివారం నుంచి 4వ తేదీ వరకు హనుమకొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు. బోధన, శిక్షణపై ఆసక్తి, నిబద్ధత కలిగి ఉండాలని తెలిపారు. సేవా రికార్డు నిర్దోషంగా ఉండడంతోపాటు కంప్యూటర్లపై తగిన పరిజ్ఞానం ఉండాలని కూడా స్పష్టం చేశారు. ఎంపికై న అభ్యర్థులకు నెలకు రూ.30వేల పారితోషికం అందజేయనున్నట్లు తెలిపారు. వివరాల కోసం కలెక్టరేట్‌ పరిపాలన అధికారి, హనుమకొండను సంప్రదించవచ్చని, ఫోన్‌ నంబర్‌ 92475 86909 ద్వారా సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో

రైతు దుర్మరణం

జనగామ రూరల్‌ : వరంగల్‌– హైదరాబాద్‌ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యవసాయ రైతు మృతిచెందాడు. మండలంలోని పెంబర్తి గ్రామానికి చెందిన రైతు మేకల శ్రీనివాస్‌(55) శుక్రవారం తన ద్విచక్రవాహనంపై వ్యవసాయ బావి వద్దనుంచి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో బైపాస్‌ రోడ్డు క్రాస్‌ చేస్తుండగా హనుమకొండ వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అదే కారులో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.

ట్రాక్టర్‌పై నుంచి జారిపడి బాలుడి మృతి

తొర్రూరు రూరల్‌: ట్రాక్టర్‌ పైనుంచి జారిపడి బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై జి.ఉపేందర్‌ తెలిపిన వివరాల మేరకు.. మానుకోట జిల్లా తొర్రూరు మండలంలోని కంఠాయపాలెం గ్రామానికి చెందిన చెట్టుపల్లి మహేష్‌, స్వరూప దంపతుల కుమారుడు ఆరుష్‌ అయాన్‌ (3) ట్రాక్టర్‌ పైకి ఎక్కించమని మారాం చేయగా తండ్రి ఎక్కించాడు. తండ్రి డ్రైవర్‌ సీట్లో ఉండగా కుమారుడు పక్కన కూర్చుని ఆడుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌పైనుంచి జారి సీసీ రోడ్డుపై పడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. తండ్రి బైక్‌పై ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement