మహబూబాబాద్: నిరుద్యోగులు, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ప్రధానంగా యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని, వారి ద్వారా పలువురికి ఉపాధి కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో పరిశ్రమలశాఖ ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తోంది. బ్యాంక్‌ల ద్వారా రాయితీ రుణాలు కల్పిస్తూ ప్రోత్సహిస్తోంది. దీంతో పరిశ్రమల స్థాపనకు జిల్లాలో యువత ముందుకు వస్తోంది. ఇచ్చిన టార్గెట్‌ను అధికారులు పూర్తి చేసి లక్ష్యం నెరవేస్తున్నారు.
కలెక్టరేట్‌లోనే జిల్లా పరిశ్రమల కేంద్రం..
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ఏర్పాటు చేశారు. జీఎం (జనరల్ మేనేజర్) సీనియర్ అసిస్టెంట్ పని చేస్తున్నారు. ఐపీఓ పోస్టు ఖాళీగా ఉంది. ఈశాఖ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యం పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాల ద్వారా పరిశ్రమలకు రాయితీ కల్పిస్తున్నాయి. జిల్లాలో 940 పరిశ్రమలు ఉండగా.. వాటిలో ఎక్కువగా రైలు మిల్లులే ఉన్నాయి. టీఎస్ ఐపాస్ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 65 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం నుంచి రూ.114 కోట్ల సబ్సిడీ వారికి మంజూరు చేశారు. వాటితో 530మంది ఉపాధి పొందుతున్నారు.
పథకాలు ఇలా..
గత ఆర్థిక సంవత్సరం 2025–26లో టీ–ఫ్రైడ్ పథకం ద్వారా ఎస్సీలకు 14 యూనిట్లు మంజూరు చేసి రూ.1.27 కోట్ల రాయితీ అందించారు. ఎస్టీలకు 115 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేసి అందుకు రూ.6.87 కోట్ల రాయితీ కల్పించారు. జనరల్‌లో 2 పరిశ్రమలు మంజూరు చేసి రూ.36 లక్షల సబ్సిడీ కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఐఐడీఆర్ పథకం ద్వారా జనరల్‌కు రెండు పరిశ్రమలను మంజూరు చేసి రూ.36 లక్షల రాయితీ అందించారు. పీఎం ఈజీపీ పథకం (స్వయం ఉపాధి) ద్వారా 60 పరిశ్రమలు మంజూరు చేశారు. అందుకు గాను రూ.2.16 కోట్ల రాయితీ ప్రభుత్వం కల్పించింది. పీఎం ఎఫ్‌ఎంఈ పథకం ద్వారా 35శాతం రాయితీ కల్పించి పది లక్షలలోపు పరిశ్రమలకు అవకాశం కల్పించింది
చేతి వృత్తులకు..
చేతి వృత్తులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం పీఎం విశ్వకర్మ పథకం ప్రవేశపెట్టింది. గత సంవత్సరం 344 మంది చేతి వృత్తిదారులను గుర్తించి గుర్తింపు కార్డులు మంజూరు చేసింది. వారిలో 253 మందికి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చింది. వారిలో 96 మందికి రూ.94 లక్షల రుణాలు మంజూరు చేసింది. డిజిటల్ ఎంప్లామెంట్ ఆఫ్ ఎక్ఛ్సేంజ్ ఆఫ్ తెలంగాణ పథకం ద్వారా కూడా రుణాలు మంజూరు చేసింది.
పీఎం ఇంటర్న్‌షిప్ పథకం..
పీఎంఐఎస్ (ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్) ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలన్నదే ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా ఏటా 1.25 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సి ఉంది. ఆ తర్వాత వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాగా సంబంధిత పోర్టల్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈమేరకు పరిశ్రమల శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
పథకాలను
సద్వినియోగం చేసుకోవాలి
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. యువతను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నదే ప్రభు త్వ ప్రధాన లక్ష్యం. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాయితీ శాతం కూడా పెంచుతుంది. దీంతో పరిశ్రమల స్థాపనపై ఆసక్తి పెరుగుతుంది. టార్గెట్ దాటి మంజూరు చేస్తున్నాం. 2026–27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలపై ప్రణాళిక తయారు చేస్తున్నాం.
–శ్రీమన్నారాయణ రెడ్డి,
జిల్లా పరిశ్రమల కేంద్రం, జనరల్ మేనేజర్
యవత పరిశ్రమలు నెలకొల్పేలా
రాయితీతో రుణాలు
పారిశ్రామికవేత్తలుగా మార్చడమే లక్ష్యం
ఉపాధి కల్పించడమే ధ్యేయంగా
ముందుకు..
జిల్లాలో 940పరిశ్రమలు..
ఎక్కువగా రైలు మిల్లులు


