దంతాలపల్లి: మండలంలోని తూర్పుతండా జీపీ స్థలాన్ని గురువారం డీఆర్‌డీఓ మధుసూదన్ రాజ్ పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడిన తూర్పుతండాకు పంచాయతీ భవన నిర్మాణం కోసం తండాకు చెందిన రాములు 14 గుంటల భూమిని దానంగా ఇచ్చారు. అయితే ప్రస్తుతం వేరే స్థలంలో నూతనంగా మంజూరైన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేట్టారు. కాగా రాములు తాను ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం చేపట్టకుండా వేరే స్థలంలో నిర్మించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూర్పుతండాలో డీఆర్‌డీఓ స్థల పరిశీలన చేశారు. ఈమేరకు రెండు స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు, గ్రామ పంచాయతీ తీర్మానాలను తీసుకెళ్లినట్లు సమాచారం. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోట్యా, ఏఎంసీ వైస్ చైర్మన్ బట్టునాయక్, ఎంపీడీఓ విజయ, ఎంపీఓ అప్సర్‌పాషా, కార్యదర్శి మమ త, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కార్మికుల హక్కులను
కాలరాస్తున్న కేంద్రం
తొర్రూరు: కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆలకుంట్ల సాయిలు అన్నారు. డివిజన్ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో గురువారం ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో మేడే కరపత్రాలను ఆవిష్కరించారు. సాయిలు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను అమలుచేస్తూ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల హక్కులను హరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడే వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు గూడూరు శ్రీను, సీతారాములు, నరేష్, గోపాల్, సురేష్, మొగిళి, బాలాజీ, పాపిరెడ్డి, ఎల్లాగౌడ్ పాల్గొన్నారు.
గజ్జెల రంజిత్‌కు
‘నాట్యఘృణి’ అవార్డు
హన్మకొండ కల్చరల్: అంతర్జాతీయ నాట్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడ శాసీ్త్రయ నృత్య కళాకారుల సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో వరంగల్‌కు చెందిన పేరిణి నాట్య గురువు గజ్జెల రంజిత్‌కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు. ఈ మేరకు బుధవారం ఆంధ్రప్రదేశ్ కాకినాడలోని దంటు కళాక్షేత్రంలో జరిగిన అంతర్జాతీయ నాట్య దినోత్సవ వేడుకల్లో గత 28 ఏళ్లుగా పేరిణి, ఆంధ్రనాట్యం, శాసీ్త్రయ నృత్య విద్యలో మెళకువలు నేర్పుతూ విద్యార్థులను కళా కారులుగా తీర్చిదిద్దుతూ, సంప్రదాయ బాణీలను పెంపొందిస్తూ నాట్యకళకు చేస్తున్న కృషికిగాను నిర్వాహకులు గజ్జెల రంజిత్‌కు నాట్యఘృణి అవార్డు ప్రదానం చేశారు.
శోభాయమానం..
పుష్పయాగం
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో శ్రీభద్రకాళిభద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మోత్సవాల్లో చివరిరోజు గురువారం ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి మూలమూర్తిని పూలమాలలతో శోభాయమానంగా అలంకరించారు. చూర్ణోత్సవం జరిపి చక్రతీర్థోత్సవం నిర్వహించి తిరిగి చక్రాన్ని అమ్మవారి సన్నిధికి చేర్చారు. అనంతరం పూర్ణాహుతి, బలిహరణ, ధ్వజావరోహణంతో ఉత్సవాలు సమాప్తం చేశారు.
అమ్మవారికి పుష్పయాగం
అమ్మవారికి శతఘటాభిషేకం జరిపి రాత్రి స్నపనమందిరంలో అమ్మవారికి వేదపండితులు మంత్రోచ్ఛరణ చేస్తుండగా రంగురంగుల గులాబీలు, మల్లెలు, లిల్లీలు, విరజాజులు, బంతులు, చామంతులు, కనకాంబరాలు తదితరపూలతో ఘనంగా పుష్పయాగం నిర్వహించారు.


