● కలెక్టర్ స్నేహ శబరీష్
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో వాణిజ్య పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉద్యానవన, ఆయిల్ పామ్ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు కేంద్రాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు కూరగాయలు, వాణిజ్య పంటల సాగు చేపట్టి లాభాలు గడించాలన్నారు. మొక్కజొన్న, వరి కొయ్యలకు నిప్పుపెట్టి కాల్చకుండా చర్యలు తీసుకోవాలని, పొలంలో వాటిని సేంద్రియ ఎరువులుగా మార్చుకునే విధంగా చూడాలని, వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల విషయంలో సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించి రైతులకు మేలు జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, డీఏఓ సరిత, డీఆర్డీఓ మధుసూదన్‌రాజ్, ఏడీఏలు, ఏఓలు తదితరులు పాల్గొన్నారు.
ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభిస్తాం..
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, కార్యదర్శి యోగితా రాణా అన్నారు. వారు హైదరాబాద్ నుంచి గురువారం విద్యా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంరద్భంగా కలెక్టర్ శబరీష్ మాట్లాడుతూ.. 2026–27 విద్యా సంవత్సరం జిల్లాలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తామన్నారు. పాఠశాలల్లో విద్యుత్, మరుగుదొడ్లు, తదితర సౌకర్యాలు కల్పిస్తామని, ఇంటర్, పదో తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో మే 11వ తేదీ నుంచి ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


