● కొనసాగుతున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్
● టార్గెట్ 6,687, వ్యాక్సిన్ పంపిణీ 976
● అవగాహన లేమితో బాలికలు టీకాలకు దూరం
నెహ్రూసెంటర్: గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం హెచ్‌పీవీ (హ్యూమన్‌పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈమేరకు మార్చి 8న ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మొ త్తంగా జిల్లాలో 6,687 మంది 14 ఏళ్ల బాలికలను గుర్తించి వారికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా, జిల్లాకు 1,513 డోసుల వ్యాక్సిన్ చేరగా.. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 976 మందికి వ్యాక్సినేషన్ చేశారు.
అవగాహన లేమితో..
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై పూర్తి అవగాహన లేకపోవడం, మొదటి విడత కావడంతో వ్యాక్సిన్ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. పూర్తిస్థాయిలో బాలికలకు, తల్లిదండ్రులకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రభావం, పనితీరును వివరిస్తే ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యశాఖ సిబ్బంది కిందిస్థాయి నుంచి అవగాహన కల్పించడం ద్వారా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకునేలా వీలుకలుగుతుంది.
14 ఏళ్ల వయసు గల బాలికలు 6,687..
హెచ్‌పీవీ వ్యాక్సిన్ 14 ఏళ్ల బాలికలకు ముందస్తు క్యాన్సర్ నివారణ కోసం ప్రభుత్వం ప్రారంభించింది. అయితే జిల్లాలో 14 ఏళ్ల బాలికలు 6,687 మంది ఉన్నట్లు గుర్తించారు. మొదటి దశలో 1,513 హెచ్‌పీవీ వ్యాక్సిన్‌లు రాగా.. ఇప్పటి వరకు 976 మాత్రమే పంపిణీ చేశారు. వ్యాక్సిన్లు పూర్తి కాగానే మరికొంత ఇండెంట్‌ను అధికారులు కోరనున్నారు.
ప్రతీ ఒక్కరికి వ్యాక్సినేషన్..
హెచ్‌పీవీ వ్యాక్సిన్ అనేది ముందస్తు క్యాన్సర్ నివారణ కోసం వేస్తున్నాం. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దు. వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 14 ఏళ్ల బాలికలకు పూర్తిగా వ్యాక్సినేషన్ చేస్తాం.
– జి.లక్ష్మీనారాయణ, పీఓ, ఇమ్యూనైజేషన్


