● ఎమ్మెల్యే
భూక్య మురళీనాయక్
మహబూబాబాద్ రూరల్: నూతనంగా నిర్మించే సబ్ స్టేషన్ ద్వారా రైతులు, ప్రజలకు నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని సోమ్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించే 33/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గురువారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణంతో ఉమ్మడి పర్వతగిరి జీపీ పరిధిలోని గ్రామాలు, తండాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. కన్నతల్లి, సొంత ఊరును మరువొద్దని, తన స్వగ్రామమైన సోమ్లతండాను తన గుండెల్లో పెట్టుకుంటానని, జన్మనిచ్చిన స్వస్థలానికి సేవచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా అని అన్నారు. గ్రామంలో సబ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు, రూ.20 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టి స్వగ్రామ రుణం తీర్చుకున్నానన్నారు. విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతులు, ప్రజలకు ఇకనుంచి ఎలాంటి సమస్యలు ఉండవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచులు ఇస్లావత్ సుజాతబాలాజీ, చల్ల అనితవెంకన్న, గుగులోత్ ఈశ్వరీరవి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ విజయేందర్ రెడ్డి, డీఈలు కోటేశ్వర్ రావు, సునీతాదేవి, హీరాలాల్, ఏడీఈలు ప్రశాంత్, ఐలయ్య, వరప్రసాద్, రూరల్ వెంకటేష్, ఎంపీడీఓ రఘుపతిరెడ్డి, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.


