● మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు
నెల్లికుదురు: గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమని, గ్రామస్తులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఉండాలని మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు కోరారు. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో గ్రామంలో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్, 10 సీసీ కెమెరాలను సర్పంచ్ గొడుగు జ్యోతి రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం డీఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడం, కారులో సీటుబెల్ట్ పెట్టుకుని డ్రైవింగ్ చేయాలని సూచించారు. మత్తు పదార్థాల కట్టడికి ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. యువత చెడు మార్గాలను వీడి సమాజంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో కేసముద్రం సీఐ సత్యనారాయణ, ఉపసర్పంచ్ వేశాల కృష్ణయ్య, నేషనల్ హైవే మేనేజర్ పట్టాబీ, పీఆర్‌ఓ ధారావత్ రవికుమార్, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.


