● కేసముద్రం మార్కెట్‌లో ఘటన
కేసముద్రం: ధాన్యం ధర తగ్గించడంతో రైతులు ఆందోళనకు దిగిన సంఘటన కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో జరిగింది. మార్కెట్‌లో మూడురోజుల క్రితం సన్నరకం ధాన్యం క్వింటాకు ధర రూ.2,488 పలుకగా, గురువారం అమాంతం తగ్గించి రూ.2,100 ధర పెట్టడంతో ఆగ్రహించిన పలువురు రైతులు మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మార్కెట్‌కు వచ్చి మూడురోజులు అవుతున్నా.. సక్రమంగా కొనుగోళ్లు చేపట్టడం లేదని, కాంటాలు పెట్టకపోవడంతో పడిగాపులు పడాల్సి వస్తోందన్నారు. ధర అమాంతం తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. మిల్లుల్లో కంటే మార్కెట్‌లోనే ధర తక్కువ పెడుతున్నారని, దీనికి మార్కెట్‌లో ఈ–నామ్ విధానం ఎందుకంటూ రైతులు ప్రశ్నించారు. మార్కెట్‌కు వచ్చిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదంటూ వాపోయారు. ఇప్పటికై నా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో పోలీసులు చేరుకుని నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.


