హన్మకొండ : జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రధాన నగరాల్లో రోడ్డు పక్కన మీకు స్థలం ఉందా? ఉంటే మీకో శుభవార్త. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్ కో) ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునే అద్భుత అవకాశం కల్పించింది. దీని ద్వారా 200 గజాల స్థలం ఉంటే చాలు ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకుని స్థిర ఆదాయం పొందొచ్చు. దీనికి ఆసక్తి కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. రెడ్‌కో వెబ్‌సైట్‌లో ఈనెల 3వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..
కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ –డ్రైవ్ స్కీమ్‌లో భాగంగా తెలంగాణలో ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. వాహనాల రద్దీ ఉన్న రోడ్డుకు పక్కన 200 చదరపు గజాల స్థలం కలిగి ఉంటే యజమానులు ఈవీ చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలో ఈవీ చార్జింగ్ మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రైవేట్ వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు..
రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో వాహనదారులు చార్జింగ్ ఖర్చయి మార్గమధ్యలో ఇబ్బందులు పడకుండా జాతీయ, రాష్ట్ర రహదారులతోపాటు నగరాల్లోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు రెడ్‌కో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్, వరంగల్, సంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ వంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ వ్యక్తులకు ఈవీ చార్జింగ్‌స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం కల్పించింది. స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయల వ్యయంలో 80 శాతం రాయితీ అందించనున్నారు. దీంతో పెట్టుబడి భారం గణనీయంగా తగ్గించుకోవచ్చు. చార్జింగ్ స్టేషన్ ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ లైన్ నిర్మాణ వ్యయం, ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు వ్యయంలో ప్రభుత్వం 80 శాతం రాయితీ అందిస్తుంది. చార్జింగ్ మిషన్, షెడ్ నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చులు స్టేషన్ ఏర్పాటు చేసుకునే వారు భరించాలి.
దరఖాస్తు ఇలా చేసుకోవాలి..
ఆసక్తి కలిగిన వారు రెడ్‌కో వెబ్‌సైట్‌లో ఇ మొబిలిటీలోకి వెళ్లి క్లిక్ చేయాలి. ఇక్కడ పీఎం ఈ డ్రైవ్‌పై క్లిక్ చేయగానే పబ్లిక్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ అండర్ కాంపోనెంట్ సి ఆఫ్ పీఎం ఇ డ్రైవ్ స్కీమ్ దరఖాస్తు కనిపిస్తుంది. ఆన్‌లైన్‌లో ఈ దరఖాస్తులో వివరాలు నమోదు చేయడంతోపాటు భూమి యాజమాన్య పత్రాలు, దరఖాస్తుదారు గుర్తింపు పత్రాలు, భూమి ఎక్కడ ఉందనే ఫొటోలు, లేఅవుట్ వివరాలు, విద్యుత్ కనెక్షన్ సమాచారం వంటి పత్రాలు అప్‌లోడ్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అవకాశం
రోడ్డు పక్కన 200 గజాల
స్థలం ఉంటే చాలు..
ఆసక్తి ఉన్న వారి నుంచి రెడ్‌కో
దరఖాస్తుల ఆహ్వానం
ఈనెల 3వ తేదీ దరఖాస్తుకు చివరి గడువు
ఎలాంటి డిపాజిట్, రుసుము
చెల్లించాల్సిన అవసరం లేదు


