జనగామ : జనగామ చరిత్రలో మరుగునపడిన పౌరాణిక పద్యరంగాన్ని తిరిగి వెలుగులోకి తీసుకొస్తూ నెల్లుట్ల ఫౌండేషన్ గతేడాది తొలి అడుగు వేసింది. అర్ధశతాబ్దం క్రితం వరకు కళాజీవుల ఊపిరి పీల్చిన ఈ రంగాన్ని మళ్లీ పునరుద్ధరించాలనే సంకల్పంతో ఫౌండేషన్ ప్రారంభించిన ప్రయాణం నేటికి ప్రాంతీయ సంస్కృతికి చారిత్రక మలుపు తీసుకొచ్చిందని చెప్పాలి.
ఏడాదిలో 25 పౌరాణిక నాటకాల
ప్రదర్శనలు..
ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 365 రోజుల్లో ఏకంగా 25 పౌరాణిక పద్యనాటక ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల జరిగిన బాసర, నిర్మల్ ప్రదర్శన ఈ ప్రయాణానికి మైలురాయిగా నిలిచింది. ఏ ఒక్క ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థ ఆర్థిక సాయం లేకుండానే స్నేహితులు, కళాభిమానుల సహకారమే ఆధారంగా ఫౌండేషన్ లక్షల రూపాయలు వెచ్చించి ఈ సేవా కార్యక్రమాన్ని ముందుకు నడిపింది.
సంస్కృతి పరిరక్షణలో
నెల్లుట్ల రవీందర్ రావు పాత్ర
ఈ ఉద్యమానికి ప్రధాన కళాకారుడిగా నిలిచిన నెల్లుట్ల రవీందర్ రావు పాత్ర కీలకం. మరుగునపడిపోతున్న భారతీయ సంప్రదాయ కళలను, పౌరాణిక పద్య నాటక సంప్రదాయాన్ని నిలబెట్టడమే ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశంగా పని చేస్తోంది. సమాజానికి విలువల పరిరక్షణ అవసరమైన ఈ కాలంలో ఈ సేవ చేయడం ఆనందంగా ఉందని రవీందర్‌రావు అన్నారు. ఈ పునర్నిర్మాణ యజ్ఞంలో అండగా నిలిచిన అనేక మంది కళాకారులు, సంగీత సృజనకర్తలు, పుర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను ఆదరించే జనగామలో పౌరాణిక పద్యరంగ పునరుద్ధరణలో నెల్లుట్ల ఫౌండేషన్ వినిపిస్తున్న సాంస్కృతిక ఘంటాభేరి, భవిష్యత్‌లో మరెన్నో కళాప్రదర్శనలకు వేదిక కానుంది.
పద్యరంగ పునర్జన్మకు నెల్లుట్ల ఫౌండేషన్ ప్రస్థానం
ఏడాదిలో 25 నాటకాల ప్రదర్శనలు
పునద్ధరించిన రంగస్థలంపై
రవీందర్‌రావు నాయకత్వం


