మేడిగడ్డ, అన్నారం బోర్‌హోల్స్‌ పనుల్లో వేగం పెంచాలి | - | Sakshi
Sakshi News home page

మేడిగడ్డ, అన్నారం బోర్‌హోల్స్‌ పనుల్లో వేగం పెంచాలి

May 1 2026 6:09 AM | Updated on May 1 2026 6:09 AM

కాళేశ్వరం: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో బోర్‌హోల్స్‌ పనుల్లో వేగం పెంచాలని ఇరిగేషన్‌ కార్యదర్శి శ్రీధర్‌.. ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను గురువారం ఆయన కలెక్టర్‌ రాహుల్‌శర్మతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేడిగడ్డలో కొనసాగుతున్న బోర్‌హోల్స్‌ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్ట్‌ల వద్ద అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. సిబ్బంది కోసం గతంలో సీఆర్పీఎఫ్‌ పోలీసులు ఉపయోగించిన షెడ్లను పరిశీలించి విద్యుత్‌, నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. అనంతరం అన్నారంలోని ఇరిగేషన్‌ కార్యాలయం వద్ద అదనపు సిబ్బంది వసతి కోసం గదులను పరిశీలించారు. అన్నారం బ్యారేజీ అప్‌ స్ట్రీమ్‌ను పరిశీలించి బోర్‌ హోల్స్‌ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టులో సాంకేతిక పరిశీలన పనులను శుక్రవారం( నేడు) నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక పరీక్షలను దశల వారీగా చేపట్టాలని, అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తక్షణమే పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా పరిశీలన పనుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. డ్రిల్లింగ్‌ పనులు చేపట్టేటప్పుడు గట్టి శిలా పొర వచ్చేంతవరకు కొనసాగించాలని సూచించారు. ప్రాజెక్టులో వివిధ దశల్లో సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూ పనుల నాణ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌ సరఫరాను నిరంతరం అందుబాటులో ఉంచాలని, ప్రతిరోజూ ఇరిగేషన్‌ అధికారులు పనులను సమగ్రంగా పర్యవేక్షించాలని ఆయన తెలిపారు. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఎన్సీ రమేశ్‌ కుమార్‌, సీఈ శ్రీనివాస్‌ గుప్తా, ఈఈలు తిరుపతిరావు, డీఈఈ సతీశ్‌, రమేశ్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement