పదో తరగతి వార్షిక ఫలితాల్లో 98.81శాతం ఉత్తీర్ణత
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రస్థాయిలో ఐదో స్థానం కై వనం చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు ఫలితాలు వెలువడ్డాయి. కాగా జిల్లా వ్యాప్తంగా 8,152 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 8,055 మంది 98.81శాతంతో ఉత్తీర్ణులయ్యారు. 3,998 మంది బాలికలకు గానూ 3,966 మంది 99.2శాతంతో ఉత్తీర్ణత సాధించారు. 4,154 మంది బాలురుకు 4,089 మంది 98.44 శాతంతో ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా బాలికలు పైచేయి సాధించారు. ఇదిలా ఉండగా 2025లో జిల్లా ప్రథమ స్థానం సాధించగా.. ప్రస్తుతం ఐదోస్థానంతో సరిపెట్టుకుంది.
100 శాతం ఉత్తీర్ణత శాతం సాధించిన
పాఠశాలలు..
మోడల్ స్కూల్స్ 4, కేజీబీవీల పాఠశాలలు 12, జెడ్పీ పాఠశాలలు 70, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 11, బీసీ వెల్ఫేర్, మైనార్టీ గురుకులం, ప్రైవేట్ పాఠశాలలు, మినీ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు..
జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 14న పరీక్ష ఫీజు చెల్లించడానికి గడువు విధించారు. పరీక్షలు జరిగే తేదీకి రెండు రోజుల ముందు వరకు రూ.50 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చు.
సివిల్స్ సాధిస్తా
మాది నిరుపేద కుటుంబం. బ్రాహ్మణపల్లిలో చిన్న చికెన్‌షాపు ఉంది. నేను ఇంజనీరింగ్ చదివి భవిష్యత్‌లో సివిల్స్ సాధించడమే నా లక్ష్యం. మా తల్లిదండ్రులకు ఏ కష్టం రాకుండా బాగా చూసుకుంటా. అమ్మ నాకు గురువు, దైవంతో సమానం. ఉపాధ్యాయుల చొరవతో కష్టపడి చదివాను. పదో తరగతి ఫలితాల్లో మా పాఠశాల నుంచి నేను 576 మార్కులు సాధించాను. – ఎస్‌కే.అఫరతబ్బుసం,
జెడ్పీహెచ్‌ఎస్, ఈదులపూసపల్లి
అందరి భాగస్వామ్యంతోనే విజయం
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 5వ స్థానం సాధించడం సంతోషంగా ఉంది. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. కష్టపడి చదివిన విద్యార్థులు భవిష్యత్ వివిధ రంగాల్లో రాణిస్తారు. పరీక్షలకు సహకరించిన పోలీసు అధికారులకు పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాం.
– మందుల శ్రీరాములు,
ఏసీజీఈ, మానుకోట
మేనేజ్‌మెంట్‌ల వారీగా ఫలితాలు
మేనేజ్‌మెంట్ పరీక్ష రాసిన ఉత్తీర్ణత ఫెయిల్
విద్యార్థులు
ఎయిడెడ్–1 3 3 –
ఆశ్రమ 774 766 8
బీసీ వెల్ఫేర్ 390 389 1
ప్రభుత్వ పాఠశాల 111 105 6
కేజీబీవీలు 516 511 5
మోడల్ స్కూల్స్ 720 715 5
ప్రైవేట్ స్కూల్స్ 1836 1,824 12
మినీ రెసిడెన్షీ 143 143 –
సోషల్‌వెల్ఫేర్ 373 368 5
ట్రైబల్ వెల్ఫేర్ 340 340 –
జెడ్పీ పాఠశాలలు 2,964 2,909 55
మొత్తం 8,152 8,055 97
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నా కల
ఉపాధ్యాయుల సలహాలు, సూచనల మేరకు ప్రతీరోజు ఉదయం 5నుంచి 7 గంటల వరకు, మళ్లీ సాయత్రం 6నుంచి 8 గంటల వరకు.. 9నుంచి 11గంటల వరకు చదివాను. టీచర్స్ సందేహాలను నివృత్తి చేసేవారు. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. బాసరలో ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ రంగంలో రాణిస్తాను. మా నాన్న ఆటో నడుపుతాడు. మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను. పదో తరగతిలో 578 మార్కులు సాధించాను.
– పరాల కీర్తన, మోడల్‌స్కూల్, మానుకోట
బాలికలు 99.2శాతం.. బాలురు 98.44శాతం పాస్
కలెక్టర్, డీఈఓ చొరవతో మెరుగైన ఫలితాలు


