సాక్షి, మహబూబాబాద్: పేదలు, తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు చదువుకునే కేజీబీవీల్లో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. టీచింగ్ స్టాఫ్‌ను నియమించిన అధికారులు.. నాన్ టీచింగ్ సిబ్బంది నియామకంలో జాప్యం చేస్తున్నారు. ఏడాదిగా ఖాళీలు భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం లోపు ఖాళీలు భర్తీ చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
32 నాన్‌టీచింగ్ ఖాళీలు..
బాలికా విద్యను బలోపేతం చేసేందుకు ప్రతీ మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసిన కేజీబీవీల్లో నాన్‌టీచింగ్ ఖాళీలు ఇబ్బందిగా మారాయి. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉండగా.. ఇందులో కొత్తగా ఏర్పడిన ఇనుగుర్తి, సీరోలు మినహా 16 మండలాల్లో కేజీబీవీలు ఏర్పాటు చేశారు. ఇందులో దంతాలపల్లి కేజీబీవీకి మినహా అన్నింటికి సొంత భవనాలు ఉన్నాయి. ఆలస్యంగా ప్రారంభించిన దంతాలపల్లి కేజీబీవీకి సొంత భవనం లేదు. అదే విధంగా ఆ పాఠశాలకు నాన్‌టీచింగ్ ఉద్యోగుల నియామకాలు చేపట్టలేదు. గత ఏడాది నర్సింహులపేట మోడల్ స్కూల్‌లో అరకొర వసతులతో నెట్టుకొచ్చారు. జిల్లాలో మొత్తం 184 నాన్‌టీచింగ్ ఉద్యోగులు పనిచేయాల్సి ఉండగా.. 152 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 32 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దంతాలపల్లి ఏఎన్‌ఎం నియామకంపై..
చిన్న ఉద్యోగం కూడా నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తున్న తరుణంలో దంతాలపల్లి ఏఎన్‌ఎం భర్తీ ప్రక్రియపై పలు విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ప్రారంభించిన దంతాలపల్లి కేజీబీవీ నాన్‌టీచింగ్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. దీంతో అక్కడ మోడల్ స్కూల్ ఉద్యోగులతోనే కొనసాగించారు. అయితే దంతాలపల్లి కేజీబీవీలో ఏఎన్‌ఎం నియామకం జరిగినట్లు.. సదరు ఉద్యోగిని హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు వచ్చిన వార్తలు అందరిని విస్మయానికి గురి చేసింది. అయితే ఈ నియామకంపై జిల్లా ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ లేకుండా భర్తీ ఎలా చేశారు. భర్తీ అయిన ఉద్యోగి ఇంతకాలం ఎక్కడ పనిచేశారు.. వచ్చే విద్యాసంవత్సరానికై నా.. పాఠశాలకు వచ్చి పనిచేస్తుందా.. అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఖాళీగా ఉన్న నాన్‌టీచింగ్ ఉద్యోగులను పాఠశాల పునఃప్రారంభానికి ముందుగానే భర్తీ చేయాలని కోరుతున్నారు.
ఖాళీలతో ఇబ్బందులు..
గురుకులాలను మించిన విధంగా బోధన జరిపే కేజీబీవీల్లో నాన్‌టీచింగ్ ఉద్యోగుల భర్తీ కీలకంగా మారింది. ప్రధానంగా అటెండర్, ఏఎన్‌ఎం, వాచ్‌మెన్, స్వీపర్లు, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్స్, నైట్ డ్యూటీ అటెండర్ ఇలా అన్నీ పోస్టులు కీలకమే. ఇందులో ఏ ఒక్కటి ఖాళీగా ఉన్నా.. ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దంతాలపల్లి 10, డోర్నకల్ 5, మహబూబాబాద్ 5, తొర్రూరు, నెల్లికుదురు, కురవి, మరిపెడ, గూడూరులో రెండేసి, చిన్నగూడూరు, గార్ల కేజీబీవీల్లో ఒక్కొక్కటి చొప్పున ఖాళీగా ఉన్నా యి. ఇందులో వంట మనుషులను డిప్యుటేషన్‌పై వేరేచోటుకు పంపించారు. కాగా డిప్యుటేషన్‌పై వెళ్లడంతో మరింత కొరత ఏర్పడింది. దీంతో వంట గదులు అపరిశుభ్రత, అన్నం, కూరలు రుచిగా వండకపోవడం, పరిసరాల అపరిశుభ్రతతో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం, పలుచోట్ల ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా దంతాలపల్లి స్కూల్‌లో నాన్‌టీచింగ్ ఉద్యోగుల నియామకం కాకపోవడంతో వచ్చే ఏడాది ఉద్యోగుల భర్తీ చేసిన తర్వాతే పాఠశాల ప్రారంభిచాల్సి ఉంటుంది.
కేజీబీవీల్లో వేకెన్సీలతో ఇబ్బందులు
వంట మనుషులు లేక సతమతం
దంతాలపల్లి ఏఎన్‌ఎం నియామకంపై విమర్శలు
వేసవి సెలవుల్లో భర్తీ చేస్తేనే పాఠశాల తెరిచేది
ఖాళీల భర్తీ ప్రక్రియ షురూ..
కేజీబీవీల్లో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ కోసం కసరత్తు మొదలైంది. విద్యా సంవత్సరం ప్రారంభం లోపు భర్తీ ప్రక్రియను పూర్తి చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. జిల్లాలోని ఖాళీలు, భర్తీ ప్రక్రియ విధానం మొదలైన అంశాలను కలెక్టర్‌కు వివరించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటిఫికేషన్, భర్తీ ప్రక్రియ జరుగుతుంది.
– రాజేశ్వర్, జిల్లావిద్యాశాఖ అధికారి


