స్టేషన్‌ఘన్‌పూర్: ఆర్థిక ఇబ్బందులతో స్టేషన్‌ఘన్‌పూర్ గత జీపీ వార్డు మాజీ సభ్యుడు, బట్టల వ్యాపారి గట్టు వెంకటస్వామి(50) మంగళవారం ఉరేసుకు ని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు మృతుడి భార్య గట్టు శ్రీవాణి, పోలీసుల కథనం ప్రకారం.. వెంకటస్వామి ఇంటివద్దే బట్టలషాపు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల వ్యా పారం సరిగ్గా నడవడం లేదు. దీంతో ఇంటిలోన్ , క్రెడిట్ కార్డు ఈఎంఐ ఎలా చెల్లించాలంటూ తరచూ మనస్తాపం చెందేవాడు. కాగా ఐదు రోజుల క్రితం శ్రీవాణి తన అక్క ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను చూసేందుకు సిద్దిపేట వెళ్లింది. ఇంటివద్ద వెంకటస్వామి, అతడి కుమారుడు రాహుల్ ఉన్నారు. రోజూ మాదిరిగానే సోమవారం రాత్రి భోజనం చేసి నిద్రించారు. మంగళవారం ఉదయం రాహుల్ నిద్రలేచి చూసేసరికి బెడ్‌రూమ్‌లో తండ్రి వెంకటస్వామి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. దీంతో భయాందోళనకు గురైన రాహుల్.. తన బాబాయ్ కుమారస్వామికి సమాచారం అందించాడు. చుట్టపక్కల వారి సాయంతో వెంకటస్వామిని కిందికి దించి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య వాణిశ్రీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.వేణు తెలిపారు.
బండారుపల్లిలో కడుపునొప్పి భరించలేక
విద్యార్థిని..
ములుగు రూరల్ : కడుపు నొప్పి భరించలేక ఓ విద్యార్థిని ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ములుగు మున్సిపాలిటీ పరిధి బండారుపల్లి చోటు చేసుకుంది. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బస్వోజు రజిత, భద్రయ్య దంపతుల కూతురు అక్షయ (17) ఇంటర్మీడియెట్ చదువుతోంది. ఈ నెల 22వ తేదీన కడుపు నొప్పి భరించలేక ఎలుకల మందుతాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మూడిళ్లలో చోరీ..
● బంగారం, నగదు, బైక్ అపహరణ
● పోలీసులకు బాధితుల ఫిర్యాదు
హసన్‌పర్తి : హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌పరిధిలోని మూడు గ్రామాల్లో మూడిళ్లల్లో చోరీ జరిగింది.ఈ మేరకు బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండలంలోని మడిపల్లికి చెందిన కాసబోయిన సురేశ్ కుటుంబసభ్యులతో కలిసి సోమవారం ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల గ్రామానికి వెళ్లాడు. మంగళవారం ఇంటికి రాగా తలుపు ధ్వంసం చేసి బీరువాలో భద్రపరిచిన సుమారు 12 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అలాగే, అన్నాసాగరం గ్రామానికి చెందిన సుధాకర్ ఇంట్లో దొంగలు చొరబడి సుమారు రూ.25వేలు చోరీ చేశారు. దేవన్నపేటకు చెందిన కందకట్ల శంకర్ ఇంటి ఆవరణలో పార్క్ చేసిన బైక్ అపహరించారు. ఈమేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిపుణులు వేలిముద్రల ఆధారాలు సేకరించారు.


