గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 30 తులాల బంగారం చోరీ | - | Sakshi
Sakshi News home page

గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 30 తులాల బంగారం చోరీ

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన

కాజీపేట రూరల్‌ : గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో ఓ మహిళ ప్రయాణికురాలికి చెందిన 30 తులాల బంగారం చోరీ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కాజీపేట జీఆర్‌పీ సీఐ వి.నరేశ్‌కుమార్‌ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 16న తేదీన గౌతమి ఎక్స్‌ప్రెస్‌ ఎస్‌–3 కోచ్‌లో బెర్త్‌ నంబర్‌ 79లో కుడిపుడి సుష్మ రాజమండ్రికి వెళ్తుంది. మార్గమధ్యలో రైలు కాజీపేట జంక్షన్‌కు చేరుకునే సమయంలో సుష్మ బ్యాగులోని 30 తులాల బంగారాన్ని అదే రైలులో ప్రయాణిస్తున్న నిందితుడు చోరీ చేసి పరారయ్యాడు. తెల్లవారుజామున తన బ్యాగు కనిపించకపోవడంతో సుష్మ లబోదిబోమంటూ డయల్‌ 100కు కాల్‌ చేసింది. రాజమండ్రికి వెళ్లాక అక్కడి జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అక్కడి వారు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కాజీపేట జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌కు మార్చి 7వ తేదీన బదిలీ చేశారు. నిందితుడు బంగారం చోరీ చేసిన అనంతరం ఖాళీ బ్యాగును, అతడి వెంట ఉన్న బ్యాగును కాజీపేట సమీపం బోడగుట్ట రైల్వే ట్రాక్‌ వద్ద విడిచి వెళ్లాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా, బ్యాగులో లభించిన రెలు టికెట్‌ ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కాజీపేట జీఆర్‌పీలో కేసు నమోదు చేసి ప్రత్యేక పోలీస్‌ టీమ్‌ను నియమించి నిందితుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో గాలిస్తున్నట్లు, నిందితుడి వివరాలు తెలిసిన వారు 8712658578 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని జీఆర్‌పీ సీఐ తెలిపారు.

ఉపాధి కూలీలపై

‘తేనె టీగల’ దాడి

● ఐదుగురికి గాయాలు ● ఆస్పత్రికి తరలింపు

ఒకరి పరిస్థితి విషమం

హసన్‌పర్తి: హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూరుపల్లి గ్రామంలో ఉపాధి కూలీలపై తేనె టీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు గాయపడ్డారు. క్షతగాత్రులకు 108 అంబులెన్స్‌ సిబ్బంది ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఎంజీఎం తరలించారు. అక్కడి నుంచి నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. 40 మంది కూలీలు మంగళవారం గ్రామ శివారులోని ఉపాధి హామీ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉదయం 8గంటల ప్రాంతంలో ఒకే సారి తేనె టీగల దాడి చేశాయి. ఈ ఘటనలో మడిపల్లి లక్ష్మి, గంట మదన్మోహన్‌రెడ్డి, గంట సుమలత, గంట కరుణాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పెద్ది తిరుపతమ్మకు గాయాయలయ్యాయి. ఇందులో మడిపల్లి లక్ష్మి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్థానికంగా డిమాండ్‌ వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement