● టెస్కో ఓఎస్డీ హిమజకుమార్
కాశిబుగ్గ: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాల అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని టెస్కో ఓఎస్డీ హిమజకుమార్ అన్నారు. మంగళవారం వరంగల్ కొత్తవాడలోని పద్మశాలి వెల్ఫేర్ ట్రస్ట్ భవనంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఐఐహెచ్‌టీ కళాశాలలో మూడేళ్ల కోర్సు అడ్మిషన్ల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. చేనేత జౌళిశాఖ సంచాలకుడు శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులు పదో తరగతి లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఎంపికై న విద్యార్థులకు మూడేళ్లలో ఆరు సెమిస్టర్లు ఉంటాయని, ప్రతీ విద్యార్థికి ప్రభుత్వం తరఫున రూ.2,500 స్టైఫండ్ ఇస్తారని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి సంవత్సరానికి రూ.4,050 ఫీజు చెల్లించాలని, నాంపల్లి సమీపంలోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో వసతి సదుపాయాలు కల్పిస్తారని వివరించారు. సదస్సులో చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు, డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బొట్టు వెంకటేశ్వర్లు, డెవలప్‌మెంట్ ఆఫీసర్ సోమ సుధీర్, యెలగం చిన్న కొమురయ్య, పంతగాని శ్రీనివాస్, యెలగం రవిరాజ్, కొలిపాక మదనయ్య, చిన్న భద్రయ్య, రాజేందర్, అడిగొప్పుల సంపత్, యెలగం సాంబయ్య, కూరపాటి సంపత్, కుమారస్వామి, శంకరలింగం, తదితరులు పాల్గొన్నారు.


