కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన జెన్‌కో ఆర్టిజన్ కార్మికుడు ముల్కల ప్రభాకర్‌రెడ్డి(50) మహారాష్ట్రలోని చింతలపల్లి చెక్‌పోస్టు వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సిరొంచ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాకర్‌రెడ్డి సిరొంచ సమీపంలోని ఫంక్షన్‌హాల్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడు. వేడుక పూర్తయిన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో కాళేశ్వరం వంతెనకు అవుతలి వైపు(మహారాష్ట్ర) అటవీశాఖ చెక్‌పోస్ట్ వద్ద ఎదురుగా క్యాంపర్ అతివేగంగా వచ్చి బారికేడ్లను తాకింది. ఇదే సమయంలో అటువైపుగా బైక్‌పై ప్రభాకర్‌రెడ్డి వస్తున్నాడు. దీంతో బారికేడ్ అదే వేగంతో ప్రభాకర్‌రెడ్డికి తగలడంతో రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే స్థానికులు మహదేవపూర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరొంచ ఎస్సై నందే పేర్కొన్నారు. మృతుడికి భార్య పద్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడు మెట్‌పల్లిలో కేటీపీపీ పంపుహౌస్‌లో ఆర్టిజన్ కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభాకర్ రెడ్డి మృతితో కాళేశ్వరంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


