ఆగుతూ.. సాగుతూ.. | - | Sakshi
Sakshi News home page

ఆగుతూ.. సాగుతూ..

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

గడువు దాటుతున్నా పూర్తికాని పనులు

టెండర్ల విషయంలోను తీవ్రజాప్యం

పెండింగ్‌లోనే ఎక్కువ బిల్లులు

మహబూబాబాద్‌ : మూడేళ్ల క్రితం మంజూరైన పనులు అంతంత మాత్రమే సాగుతున్నాయి. అవి కూడా నేటికి పూర్తి కాలేదు. అయితే కొన్ని పనులు ప్రారంభం కాకపోగా మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో అవి రద్దయినట్లు అధికారులు తెలిపారు. పెండింగ్‌లో ఎక్కువ బిల్లులు ఉండడంతోనే పనులు సాగడం లేదు.

కార్యాలయం పరిధిలో మూడు సబ్‌డివిజన్లు

ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ (కార్యనిర్వాహక శాఖ ఇంజనీర్‌ కార్యాలయం) పరిధిలో మూడు సబ్‌ డివిజన్లు ఉన్నాయి. గూడూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో గూడూరు, కేసముద్రం, గంగారం, కొత్తగూడ, ఇనుగుర్తి మండలాలు ఉన్నాయి. మరిపెడ సబ్‌ డివిజన్‌ పరిధిలో మరిపెడ, డోర్నకల్‌, కురవి, నర్సింహులపేట, సీరోలు, దంతాలిపల్లి, చిన్నగూడూరు మండలాలు ఉన్నాయి. మానుకోట సబ్‌ డివిజన్‌ పరిధిలో మానుకోట, తొర్రూర్‌, బయ్యారం, గార్ల, పెద్దవంగర, నెల్లికుదురు మండలాలు ఉన్నాయి. రెగ్యులర్‌ ఈఈతో పాటు ఐదుగురు డీఈలు, 11 మంది ఏఈఈలు విధులు నిర్వరిస్తున్నారు. కార్యాలయంలో సూపరిటెండెంట్‌, డీఏఓ, ఏఈఈ ఒకరు, ఏఈ, టీఓ, ఏటీఓ, జేటీఓ, టీఏ ఒక్కొక్కరు, సీనియర్‌ అసిస్టెంట్లు నలుగురు, జూనియర్‌ అసిస్టెంట్లు ఐదుగురు, టైపిస్టులు ఇద్దరు, రికార్డు అసిస్టెంట్‌ ఒకరు, అటెండర్లు ఐదుగురు పని చేస్తున్నారు.

మంజూరైన పనులు అంతంతే..

మూడేళ్ల ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన పనులు అంతంత మాత్రమే. దీంతో పూర్తిస్థాయిలో ఉన్న అధికారులు పెద్దగా పనులు లేక కార్యాలయానికి పరిమితమవుతున్నారు. కొన్ని పనులు కావడం, అవి కూడా నత్తనడక సాగడంతో పదే పదే పనుల పరిఽశీలన బిల్లులు చేసే పని కూడా లేదు.

పనులను పరిశీలిస్తే..

● 2023–24లో కేసముద్రం బైపాస్‌ కిలోమీటరు పనులకు రూ.5 కోట్లు మంజూరు కాగా నేటికి విస్తరణ పనులు సాగుతున్నాయి.

● కేసముద్రం నుంచి నెల్లికుదురు నాలుగు కిలోమీటర్లకు రూ.20 కోట్లు మంజూరు కాగా పనులు నడుస్తున్నాయి

● గూడూరు మండలంలోని నాయక్‌పల్లి నుంచి గోవిందాపురం వరకు 12కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.24 కోట్లు రాగా పనులు కొనసాగుతున్నాయి.

● మానుకోట మండలంలోని జమాండ్లపల్లి నుంచి రెడ్యాల వరకు 10కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.25 కోట్లు మంజూరు కాగా కేవలం 40శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

● 2024– 25లో ప్లాన్‌వర్స్‌ నుంచి మానుకోట మున్సిపల్‌ పరిధిలోని బేతోలు నుంచి పర్వతగిరి వరకు 8.7 కిలో మీటర్లకు రూ.17కోట్లతో పనులు జరుగుతున్నాయి.

● గూడూరు–కేసముద్రం1.6 కిలోమీటర్లు, మరో రోడ్డు 4 కిలో మీటర్లకు రూ.40 కోట్లు కంకర పూర్తయ్యి, బీటీ పనులు సాగుతున్నాయి.

● కేసముద్రం మండలంలోని పెనుగొండ–అర్పనపల్లి మధ్య 10 కిలోమీటర్ల రోడ్డు బీటీ పనులు తుదిదశకు చేరాయని అధికారులు పేర్కొన్నారు.

● తొర్రూరు నుంచి కంఠాయపాలెం 4 కిలోమీటర్లకు రూ.6 కోట్ల నిధులు రాగా పనులు ప్రారంభం కాలేదు, అగ్రిమెంట్‌ ఆలస్యమైంది.

● 2025–26లో కొత్తగూడ మండల కేంద్రం నుంచి దుబ్బగూడెం 5 కిలోమీటర్ల రోడ్డుకు రూ.7 కోట్లు టెండర్‌ పెండింగ్‌లో ఉంది.

● సెంట్రల్‌ రోడ్డు ఫండ్‌ నిధుల నుంచి డోర్నకల్‌ మండలంలోని చిలక్కొడు నుంచి వెన్నారం వరకు 10 కిలోమీటర్ల రోడ్డకు రూ.22 కోట్లతో అగ్రిమెంట్‌ పూర్తయినా, పనులు ప్రారంభం కాలేదు.

● గార్ల నుంచి గుండ్రాతిమడుగు వయా రాంపురం 10 కిలో మీటర్ల రోడ్డకు రూ.20 కోట్లు టెండర్‌ దశలోనే ఉన్నాయి. ఇల్లందు నుంచి పాకాల రోడ్డులో 2కిలో మీటర్ల రోడ్డు వెడల్పు పనులు రూ.12 కోట్లతో సాగుతున్నాయి.

తగ్గుతున్న నాణ్యత..

గడువులోగా పనులు పూర్తయితేనే నాణ్యతగా ఉంటుంది. కాని ఆగుతూ.. సాగుతూ పనులు జరుగుతున్నప్పుడు క్యూరింగ్‌ విషయంలో లోపం జరుగుతుంది. బిల్లులు రావడం లేదనే కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తేనే పనులు వేగవంతంగా పూర్తవుతాయి.

ఒక్క పనికూడా పూర్తి కాలేదు

మానుకోట నుంచి కేసముద్రం వరకు రోడ్డు మంజూరైనా టెండర్లు ముందుకు రాకపోవడంతో ఆ పని రద్దు చేశారు.

కేసముద్రం మండలంలోని పెనుగొండ–అర్పనపల్లి రోడ్డు మాత్రమే తుది దశఽకు చేరింది. కేసముద్రం బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి రూ.5 కోట్లకు రూ.2 కోట్లు మాత్రమే వచ్చాయి. కేసముద్రం–నెల్లికుదురు రోడ్డుకు రూ.20 కోట్లకు రూ.6.90 కోట్లు వచ్చాయి. గూడూరు మండలం నాయక్‌ పల్లి–గోవిందాపురం రోడ్డుకు రూ.24 కోట్లకు రూ.1.76 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు. మానుకోట మండలంలోని జమాండ్లపల్లి నుంచి రెడ్యాల రోడ్డుకు రూ.25 కోట్లకు ఒక్క బిల్లు కూడా రాలేదని 40 శాతం పనులు పూర్తయ్యాయని చెబుతున్నారు .

Advertisement
 
Advertisement
Advertisement