కూరగాయల సాగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

కూరగాయల సాగుకు ప్రోత్సాహం

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

హన్మకొండ: కూరగాయల సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ దిశగా రాయితీపై కూరగాయల నారుతో పాటు విత్తానాలు రాయితీపై అందిస్తోంది. దీంతో పాటు రైతులను మరింతగా ప్రోత్సహించేందుకు ప్రతీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి ఒక్కో కూరగాయల పంట సాగు చేసే రైతును ఎంపిక చేసింది. వీరికి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చింది. డిమాండ్‌ మేరకు కూరగాయల ఉత్పత్తి, సరఫరా చేసేలా ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రైతులను ప్రోత్సహిస్తోంది. కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచే దిశగా రైతులను కూరగాయల సాగు వైపు మళ్లించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుంచి ఒక్కో రైతును ఎంపిక చేశారు. హనుమకొండ జిల్లాలో 14 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి 14 మంది రైతులు, వరంగల్‌ జిల్లాలో 28 ప్రాథమిక సహకార సంఘాల నుంచి 28 మంది రైతులను ఎంపిక చేశారు. వీరికి రాష్ట్రంలో ఒక సారి, జిల్లాలో ఒక సారి శిక్షణ ఇచ్చారు. వీరు ఇతర రైతులను కూరగాయల సాగు వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించనున్నారు.

కలుపు సమస్యను అధిగమించేందుకు..

కలుపు సమస్యను అధిగమించడానికి, ఎరువుల యాజమాన్యం, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడి సాధించడానికి మల్చింగ్‌ పద్ధతి ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలో సాగు ఎకరాకు రూ.8 వేల చొప్పున 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తోంది. అంతేకాకుండా కూరగాయల (వంగ) సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. భూమి నుంచి సంక్రమించే వివిధ రకాల తెగుళ్లను, చౌడు నేలలను తట్టుకునేలా.. అధిక దిగుబడి, ఎక్కువ కాలం దిగుబడి ఇచ్చేలా వంగలో అంటు మొక్కలను సరఫరా చేస్తోంది. దీనికి ప్రభుత్వం ఎకరానికి రూ.30 వేల రాయితీ ఇస్తోంది. ట్రెల్లిసింగ్‌ విధానంలో టమాట, ఇతర కూరగాయల పంటల సాగు చేసేందుకు ప్రభుత్వం ఎకరానికి రూ.10 వేల రాయితీ అందిస్తున్నారు. సూక్ష్య సేద్యం, బిందు సేద్యానికి బీసీ, సన్నకారు, చిన్నకారు రైతులకు 80 శాతం, ఎస్సీ, ఎస్టీ రైతులకు 90 శాతం, ఇతరులకు 70 శాతం రాయితీని, తుంపర్ల సేద్యానికి అన్ని కేటగిరీల రైతులకు 65 శాతం రాయితీపై పరికారులు అందిస్తున్నారు.

అధికారులను సంప్రదించాలి

రాష్ట్ర ప్రభుత్వం కూరగాయల సాగుకు అందిస్తున్న రాయితీని రైతులు సద్వినియోగం చేసుకోవాలి. సాగు విస్తీర్ణాన్ని పెంచాలి. డిమాండ్‌ ఉన్న, కూరగాయల సాగు లాభదాయకం. నారు, ఇతర పద్ధతుల్లో సాగుకు రాయితీ పొందేందుకు అందుబాటులో ఉన్న ఉద్యాన అధికారులను సంప్రదించాలి.

– శ్రీనివాస్‌రావు, వరంగల్‌ జిల్లా ఉద్యాన,

పట్టు పరిశ్రమ శాఖ అఽధికారి

వందశాతం రాయితీపై నారు

ఒక్కో రైతుకు 5 ఎకరాల పరిమితి

ప్రతీ పీఏసీఎస్‌ నుంచి వలంటీర్‌గా

రైతు ఎంపిక

రెండు దఫాలుగా శిక్షణ పూర్తి

రాయితీ ఇలా..

కూరగాయల పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీ ద్వారా నారు, విత్తనాలు సరఫరా చేస్తోంది. ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు వంద శాతం రాయితీపై నారు సరఫరా చేస్తోంది. 5 ఎకరాల వరకు కూరగాయల పంటల సాగుకు విత్తనాలకు రూ.9,600 రాయితీ అందిస్తోంది. వంద శాతం రాయితీపై టమాట, వంగ, పచ్చి మిరప, క్యాబేజీ, క్యాలీఫవర్‌ నారును సరఫరా చేస్తోంది. సిద్దిపేట జిల్లా ములుగు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో రైతు సూచించిన రకం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీనికి గాను రైతులు 30 రోజుల ముందుగా విత్తన రకం, పట్టాదారు పాస్‌ బుక్‌, ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా పాస్‌ బుక్‌ జిరాక్స్‌ ప్రతులను జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. శాశ్వత పందిర్ల నిర్మాణం, కూరగాయల సాగుకు సైతం ప్రభుత్వం రాయితీ అందిస్తోంది. అర ఎకరానికి రూ.50 వేల చొప్పున రెండున్నర ఎకరాలకు వరకు రాయితీ ఇవ్వనుంది.

Advertisement
 
Advertisement
Advertisement