సీకేఎం ఆస్పత్రికి ఆర్‌ఎంఓ కావలెను..! | - | Sakshi
Sakshi News home page

సీకేఎం ఆస్పత్రికి ఆర్‌ఎంఓ కావలెను..!

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

కాశిబుగ్గ: వరంగల్‌ సీకేఎం ఆస్పత్రికి రెగ్యులర్‌ ఆర్‌ఎంఓ లేకపోవడంతో సేవలపై స్తబ్ధత నెలకొంది. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన డాక్టర్‌ మురళీని కలెక్టర్‌ ఆదేశాల మేరకు పిడియాట్రిక్‌ విభాగానికి పంపించారు. దీంతో నెలరోజులపైనుంచి రెగ్యులర్‌ ఆర్‌ఎంఓగా ఎవరు విధులు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆస్పత్రిలో పలు విభాగాలను చూడటానికి ఆరుగురు ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓలకు బాధ్యతలు అప్పజెప్పారు. వీరిలో ముగ్గురు సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ ఉర్సు ఆస్పత్రి నుంచి వచ్చి డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు సీకేఎంకు చెందిన వైద్యులు కూడా సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు కావడంతో ఆర్‌ఎంఓగా విధులు నిర్వహించడానికి వీలులేదు. ఆర్‌ఎంఓగా బాధ్యతలు చేపట్టడానికి తప్పనిసరిగా డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ అయి ఉండాలి. ప్రస్తుతం ఇన్‌చార్జి ఆర్‌ఎంఓలతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో రెగ్యులర్‌ ఆర్‌ఎంఓ పోస్టు భర్తీ అయితే అడ్మినిస్ట్రేషన్‌తో పాటు పేషంట్లకు సేవలు మెరుగయ్యే అవకాశం ఉంది.

కాంటాలైన వడ్లు..

కారుమబ్బుల గుబులు

దేవరుప్పుల: మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా గిట్టుబాట ధర కోసం నీరిక్షిస్తున్న అన్నదాతలకు అకాల వర్షం ముంచుకొస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో మంగళవారం సాయంత్రం కారుమబ్బులను చూసి అప్రమత్తమవుతున్న రైతులకు క్షణాల్లోనే వర్షపు జల్లులు పడడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా పెట్టి నాలుగైదు రోజులైనప్పటికీ రైస్‌ మిల్లర్లు లారీలు పంపకపోవడంతో ఇటు నిర్వహకులు, రైతులు అయోమయంలో పడ్డారు. ఇదే అదనుగా వర్షం పడడంతో ధాన్యం భద్రపర్చేందుకు తగిన తాటిపత్రులు లేకపోవడంతో కొంత మంది రైతుల కల్లాలు తడిసిపోయాయి. మరికొంత మంది రైతులు కాంటా పెట్టిన ధాన్యం భద్రత కోసం నానా తంటాలు పడ్డారు. ఏదిఏమైనా ప్రభుత్వం యంత్రాంగం యుద్ధప్రాతిపదికన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కాంటా పెట్టి తరలించకపోతే అకాల వర్షాలు వస్తే రైతులకు తీరని నష్టం వాటిల్లే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వందేమాతరం..

సమర నినాదం

కేయూ క్యాంపస్‌ : వందేమాతర గేయం.. ఒక నినాదం మాత్రమే కాదని సమర రణనినాదమని ఏబీవీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వీరేంద్రసింగ్‌సోలంకి పేర్కొన్నారు. జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందేమాతరం ఉత్సవ సమితి, ఏబీవీపీ ఆధ్వర్యంలో మంగళవారం కాకతీయ యూనివర్సిటీలోని సెనేట్‌ హాల్‌లో విద్యార్థులతో కలిసి సామూహికంగా పూర్తి వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశం స్వాతంత్య్రం సాధించేందుకు బ్రిటిష్‌లకు వ్యతిరేకంగా వందేమాతరం స్ఫూర్తితో నాడు ప్రజలు పోరాటం చేశారన్నారు. వందేమాతరం కేవలం ఒక నినాదం కాదు అని.. దేశ ప్రజలను ఏకీకృతంచేసిన గేయం అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశ విభజనకు ఇప్పటికి విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటున్నారని అలాంటి శక్తులకు వ్యతిరేకంగా వందేమాతరం స్ఫూర్తితో ఐక్యంగా యువత ముందుకెళ్లాలని అలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలో యువ త భాగస్వాములు కావాలన్నారు. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు, యూనివర్సిటీ కార్యదర్శి జ్ఞానేశ్వర్‌, బాఽ ద్యులు ప్రశాంత్‌, సతీష్‌, సాయి పాల్గొన్నారు.

మహిళను ఢీ కొట్టిన బైక్‌

ఐనవోలు: బైక్‌ అదుపు తప్పి ఓ మహిళను కొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలై విషమంగా మారిన సంఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ఐనవోలు మండల కేంద్రానికి చెందిన గడ్డం భాగ్యమ్మ ఆలయం వైపు వెళ్తోంది. ఈ క్రమంలో పెరుమాండ్లగూడెంకు చెందిన మధు అతి వేగంగా బైక్‌పై వస్తు అదుపు తప్పి రోడ్డు పక్కన వెళ్తున్న భాగ్యమ్మను వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. స్థానికులు, కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించగా భాగ్యమ్మను వరంగల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement