దివ్యాంగ సారథి | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగ సారథి

Apr 29 2026 7:48 AM | Updated on Apr 29 2026 7:48 AM

కాజీపేట : ఇప్పటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు అందజేస్తున్న పథకాలు, సంక్షేమాల సమాచారం తెలియకపోవడంతో చాలా మంది అవకాశాలను వినియోగించుకోలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దివ్యాంగ సారథి పేరిట ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో దివ్యాంగులకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పథకాలే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన అన్ని అంశాలను తెలుసుకోవచ్చు. కేంద్ర న్యాయ సామాజిక శాఖ మంత్రి అధికారికంగా ప్రారంభించారు. దీనిలో ఒక్క దివ్యాంగులే కాకుండా యాసిడ్‌ దాడి బాధితులతో పాటు పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి అందించే సాయంపై సమాచారం కూడా అందుబాటులోకి తెచ్చింది. జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ దివ్యాంగ్‌ సారథి యాప్‌పై అవగాహన కల్పిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ ఉంటే గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని విలువైన సమాచారాన్ని పొందవచ్చు. ప్లేస్టోర్‌లో దివ్యాంగ సారథి అని టైప్‌ చేస్తే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇంగ్లిషు, హిందీలో సమాచారం అందుబాటులో ఉంది. ఎవరిని ఎలా సంప్రదించాలో ఫోన్‌ నంబర్లు ఈ యాప్‌లో ఉంచారు.

దివ్యాంగుల హక్కులు, పథకాలపై ప్రత్యేక యాప్‌

ఇంటి నుంచే కృత్రిమ అవయవాల సమాచారం

ఉన్నత చదువులు, ఉద్యోగావకాశాలపై క్షణాల్లో సమాచారం

ఏఏ అంశాలు తెలుసుకోవచ్చంటే..

దివ్యాంగులకు రవాణా, ఇతర సౌకర్యాల్లో రాయితీలు, దీన్‌దయాళ్‌ రిహాబిటేషన్‌ స్కీమ్‌ విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగ అవకాశాల కోసం ఉచిత శిక్షణ, ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై సమాచారం. జాతీయ ఉపకార వేతనాలు, ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌ షిప్‌లు, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి సాయం, ఉన్నత చదువుల కోసం అత్యున్నత ప్రమాణాల్లో విద్య అందించే పథకాల గురించి ఈ యాప్‌లో వివరాలను అందుబాటులో ఉంచారు. ఆయా పథకాలకు అర్హతల వివరాలు దరఖాస్తు విధానాలు పొందుపర్చారు. భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ వివరాలు తెలుసుకోవచ్చు. అవయవాలు కావాల్సిన వారు వాటి కోసం ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలు ఉంటాయి. దివ్యాంగులకు ఉద్దేశించిన ప్రత్యేక సంస్థల సమాచారం అభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement